Shubhanshu Shukla: వెళ్లటమే కాదు శుభాన్షు శుక్లా తిరిగి రాక కూడా వాయిదానే
10న కాదు జూలై 14న భూమిపైకి తిరిగి వస్తారని ప్రకటించిన నాసా..;
ఆక్సియం-4 మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు అస్ట్రోనాట్స్ జూలై 14వ తేదీన భూమి పైకి తిరిగి రాబోతున్నారని నాసా ప్రకటించింది. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ గురువారం నాడు ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే, ఆక్సియం-4 మిషన్ పురోగతిని క్షణ్ణంగా పరిశీలిస్తు్న్నామని, దానిని ఈనెల 14వ తేదీన అన్ డాక్ చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
కాగా, ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి జూన్ 25వ తేదీన ఆక్సియం-7 మిషన్ ను నాసా ప్రయోగించింది. మరుసటి రోజు ఐఎస్ఎస్ లో అస్ట్రోనాట్స్ విజయవంతంగా ల్యాండ్ అయ్యారు. అప్పటి నుంచి శుభాన్షు శుక్లా సహా ఇతర వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో పలు ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. అయితే, వారు జూలై 10వ తేదీనే భూమి పైకి తిరిగి రావాల్సి ఉండగా.. దానిని జూలై 14వ తేదీకి వస్తున్నారని నాసా వెల్లడించింది. భూమి మీదకు వచ్చిన తర్వాత వ్యోమగాములు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.
ISSలో శుభాన్షు శుక్లా వివిధ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో మొక్కల పెరుగుదల, స్టెమ్ సెల్ పరిశోధన, వ్యోమగాముల జీవశాస్త్రంపై మైక్రోగ్రావిటీ ప్రభావం వంటి వాటిపై ఆయన ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా సూట్ రైడ్ ప్రాజెక్టులో భాగంగా మధుమేహం పర్యవేక్షణకు ఉపయోగించే టెక్నాలజీలను అంతరిక్షంలో పరీక్షిస్తున్నారు.
ఆక్సియం-4 మిషన్‌లో శుభాన్షు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గి విట్సన్ (అమెరికా), మిషన్ స్పెషలిస్ట్ స్లావోస్ ఉజ్నాన్స్కీ-విస్నియెవ్స్కి (పోలాండ్), మిషన్ స్పెషలిస్ట్ టిబోర్ కపు (హంగేరీ) ఉన్నారు.
ఆక్సియం-4 మిషన్ సిబ్బంది సురక్షితంగా భూమికి తిరిగి రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆక్సియం స్పేస్, స్పేస్‌ఎక్స్, నాసా ,అంతర్జాతీయ భాగస్వాములు పర్యవేక్షిస్తున్నారు.