Shubhanshu Shukla: శుభాన్షు శుక్లా తిరుగు ప్రయాణం నేడు
ముగిసిన భారత వ్యోమగామి అంతరిక్ష యాత్ర;
దాదాపు 18 రోజులపాటు ఐఎస్‌ఎస్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురి వ్యోమగాముల తిరుగు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఐఎస్‌ఎస్‌లో యాక్సి యం-4 మిషన్ అన్‌డాకింగ్ సోమవారం మధ్యాహ్నం 4.35 గంటలకు (భారత కాలమానం) చేపడుతున్నారు. ‘యాక్సియం-4 మిషన్ భూమి మీదకు చేరుకోవటంలో చివరి తంతు ‘స్లాష్ డౌన్’ 15న మధ్యాహ్నం 3 గంటలకు (భారత కాలమానం) ఉంటుంది’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రస్తు తం ఐఎస్‌ఎస్‌లో 11మంది వ్యోమగాములు ఉన్నారు. ఏడుగురు భూమి మీదకు రావా ల్సి ఉంది. శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సుమారుగా రూ.550 కోట్లు ఖర్చు చేసింది. ఈ అనుభవంతో ఇస్రో 2027లో ‘గగన్‌యాన్’ను చేపట్టబోతున్నది.
శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు పెగ్గీ విట్సన్, స్లావోజ్ ఉజ్‌నాన్‌స్కీ– విస్నివ్‌స్కీ, టిబోర్ కపు.. భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఐఎస్‌ఎస్ నుంచి వేరుపడతారు. ఆ తర్వాత.. క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమి దిశగా ప్రయాణం సాగిస్తారని నాసా ప్రకటించింది. రేపు సాయంత్రం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో భూమిపై అడుగు పెడతారని తెలిపింది. శుభాంశు శుక్లాతోపాటు ఇతర వ్యోమగాములు భూమికిపైకి తిరిగివచ్చిన తర్వాత వారం రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటారు. సైంటిస్టులు వారికి పరీక్షలు నిర్వహిస్తారు. భూ వాతావరణానికి పూర్తిస్థాయిలో అలవాటు పడిన తర్వాత వ్యోమగాములు బాహ్య ప్రపంచంలోకి వస్తారు.
స్పేస్‌ఎక్స్ యాగ్జియం–4 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు గత నెల 25న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. 18 రోజుల తర్వాత.. ‘ఐఎస్‌ఎస్’లో నేడు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శుభాంశు మాట్లాడుతూ.. ఇదొక అద్భుత ప్రయాణమని చెప్పారు. ఇదంతా మాయగా అనిపిస్తోందన్నారు. ‘ఐఎస్‌ఎస్’ నుంచి ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలను తీసుకెళ్తున్నానని.. వాటిని తన దేశ ప్రజలతో పంచుకుంటానని తెలిపారు.