మేము మారిపోయాం: తాలిబన్ల సంచలన ప్రకటన..
Taliban:ఆఫ్గన్‌లారా ఆందోళన చెందకండి. మిమ్మల్ని మేము ఏమీ చేయం. మీ పనులు మీరు చేసుకోండి. ఆఫీసులకు వెళ్లండి..;
ఆఫ్గన్‌లారా ఆందోళన చెందకండి. మిమ్మల్ని మేము ఏమీ చేయం. మీ పనులు మీరు చేసుకోండి. ఆఫీసులకు వెళ్లండి.. ఉద్యోగాలు చేసుకోండి. మీరు మీ సాధారణ జీవితాన్ని గడపండి అని తాలిబన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆఫ్గన్లపై అధికారాన్ని చేజిక్కించుకున్న రెండు రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రతి ఒక్కరికీ క్షమాభిక్ష పెడుతున్నాం. అందువల్ల మీరు మాపై పూర్తి విశ్వాసం ఉంచి మీ జీవనం కొనసాగించండి అని తాలిబన్లు ప్రకటనలో వెల్లడించారు. ఆఫ్గాన్ తాలిబన్ల వశమవడంతో అక్కడి ప్రజలు తీవ్రభయాందోళనలు చెందుతున్నారు. మళ్లీ చీకటి రోజులు తప్పవని భీతిల్లుతున్నారు. గతంలో తాలిబన్ల అరాచక పాలన ఇంకా కళ్లముందే కనబడుతోంది. మళ్లీ ఆ పరిస్థితులు తిరిగి పునరావృతమవుతాయని భయభ్రాంతులకు గురవుతున్నారు.
కానీ ఆఫ్గన్ల ఆలోచనలను తిప్పికొడుతూ తాలిబన్లు శాంతి మంత్రం జపిస్తున్నారు. ఆక్రమణ సమయంలో కూడా ఎలాంటి రక్తపాతం జరగకుండా చూసుకున్నారు. ఏ విధమైన హింస జరగకుండా శాంతి యుతంగా జరగాలని ముందుగానే అధికార ప్రతినిధులు ఆజ్ఞలు జారీ చేశారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లలోకి ప్రవేశించవద్దని ఆదేశించారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడాలని సూచించారు. ఈ మేరకు తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అమెరికా నేతృత్వంలోని కూటమి తరపున పనిచేసిన వారిపై తాము ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ హామీ ఇచ్చారు. అఫ్గాన్ ప్రజల్లో అనవసరపు భయాందోళనలు కలిగించవద్దని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.