TALIBAN: బంగ్లాలో తాలిబన్ల క్యాంపులు? భారత్‌కు కొత్త టెన్షన్!
బంగ్లాదేశ్‌లో టీటీపీ జాలం విస్తృతి – భారత్‌కు భద్రతా హెచ్చరిక;
పాకిస్థాన్‌కు తలనొప్పిగా మారిన తెహ్రీకే-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఇప్పుడు తన ఉగ్ర కార్యకలాపాలను బంగ్లాదేశ్‌లో విస్తరిస్తోంది. ఈ పరిణామం భారత్‌కు సైతం భద్రతా పరంగా ముప్పుగా మారే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, ఢాకా ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఇద్దరు బంగ్లాదేశీలు పాకిస్థాన్ మీదుగా అఫ్గానిస్థాన్‌కు చేరుకున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. వారిలో ఒకరు వజీరిస్థాన్‌లో పాక్ సైన్యంతో ఎదురుకాల్పుల్లో హతమవ్వగా, మరొకరు టీటీపీ శిబిరాల్లో శిక్షణ తీసుకొని తిరిగి వచ్చాడు. మలేషియాలో టీటీపీ సంబంధాలున్న 36 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్ ఈ వ్యవహారాన్ని మరింత బలపరుస్తోంది. టీటీపీ తరఫున బంగ్లాదేశ్‌లో మౌలికంగా పనిచేస్తున్న షమాన్ మహఫుజ్ గతంలో జమాత్ ఉల్ ముజాహిద్దీన్కి వ్యవస్థాపకుడు. అతడిపై 2014, 2023లో కేసులు నమోదయ్యాయి. తాజాగా అతడిని తిరిగి అరెస్టు చేశారు. మరో అనుమానితుడైన ఎండీ ఫైసల్ అఫ్గాన్‌లో శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరిని టీటీపీకి పరిచయం చేసిన వ్యక్తిగా ఇమ్రాన్ హైదర్ అనే ఏరోనాటికల్ ఇంజినీర్ పేరు వినిపిస్తోంది. ఈ పరిణామాలు బంగ్లాదేశ్‌ను టెర్రర్ ట్రాన్సిట్ పాయింట్‌గా మార్చే ప్రమాదాన్ని చూపిస్తున్నాయి. ఇది దక్షిణాసియాలో భద్రతా సమతౌల్యాన్ని గణనీయంగా దెబ్బతీయనుంది.
బంగ్లాదేశ్‌లో అంతర్గత అస్థిరతను ఆసరాగా చేసుకొని టీటీపీ అక్కడ తన జాలాన్ని విస్తరించుకోవడం ఆందోళనకరం. హసీనా ప్రభుత్వం పతనానికి తరువాతే ఈ ఉగ్రవాద శృంఖల బలపడటం అనుకోకుండా జరగలేదు. దేశవాళీ జిహాదీ గ్రూపులు బలపడిన వేళ టీటీపీ వారిని చురుకుగా చేర్చుకోవడంలో ముందుంది. బంగ్లాదేశ్ యువతను టార్గెట్ చేస్తూ జిహాద్‌కు ప్రేరేపిస్తున్న ఆన్లైన్ ప్రాపగండా పెరుగుతోంది. చిట్టగాంగ్ హిల్స్ ప్రాంతం ఉగ్ర శిబిరాలకు కేంద్రంగా మారుతున్నట్టు నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నాయి. భారత్‌కు దగ్గరగా ఉన్న బంగ్లా-నేపాల్ మార్గం ద్వారా టీటీపీ శిక్షణ పొందిన ఉగ్రవాదులు ప్రవేశించే ముప్పు ఉంది. గతంలో 2016 ఢాకా ఉగ్రదాడిలో బయటపడిన బంగ్లా ఉగ్రశక్తుల ఉనికిని మరువలేం. ఈసారి కూడా అదే తరహా మల్టీ-నేషనల్ టెర్రర్ నెట్వర్క్ వెలుగు చూస్తుండటం ప్రమాద సంకేతం. భారత్, బంగ్లాదేశ్ భద్రతా ఏజెన్సీలు కలసి చురుకైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది. ప్రాంతీయ భద్రతను కాపాడుకోవడంలో ఢాకా పాలకుల బాధ్యత మరింత పెరిగింది – వారి మూగ వైఖరి ప్రమాదకరం.