వణికిపోయిన అలస్కా..ఆ దీవుల్లో సునామీ హెచ్చరికలు
Earthquake in Alaska: అమెరికాలోని అలాస్కా ద్వీపకల్పం భూప్రకంపనలతో వణికిపోయింది.;
Alaska file Photo
Earthquake in Alaska: అమెరికాలోని అలాస్కా ద్వీపకల్పం భూప్రకంపనలతో వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో భూమి కంపించిందని అమెరికా భూగర్భ పరిశోధన విభాగం వెల్లడించింది. అలాస్కాకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలోని పెరీవిల్లేలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఫెర్రివిల్లేకి తూర్పు నైరుతీ దిశగా... 56 మైళ్ల దూరంలోని 29 మైళ్ల లోతున సముద్ర గర్భంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ భారీ భూకంపం సంభవించిన అరగంట తర్వాత 6.2, 5.6 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు భూగర్భ పరిశోధన విభాగం వివరించింది.
అలస్కా ద్వీపకల్పాన్ని భారీ భూకంపం వణికించిన వేళ..హవాయి దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప తీవ్రత కారణంగా మరో మూడు, నాలుగు గంటల్లో సునామీ సంభవించే సూచనలు ఉన్నాయని యూఎస్ సునామీ వార్నింగ్ సిస్టం హెచ్చరించింది. దీని ప్రభావం వల్ల సముద్రపుటలలు ఉవ్వెత్తున ఎగసిపడుతాయని, సమీప గ్రామాలవారు అప్రమత్తంగా ఉండాలని. ఇప్పటి నుంచే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడం మంచిదని ఈ వ్యవస్థ సూచించింది. గ్వామ్, అమెరికన్ సమోవా దీవులపై తీవ్రత ఎక్కువ ఉండొచ్చన్న అనుమానాల మధ్య... ఆ తీరాల్లో నిఘా పెంచారు.
1964 మార్చిలో అలాస్కాలో 9.2 మ్యాగ్నిట్యూడ్ తో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా 250 మందికి పైగా మరణించగా వేలమంది గల్లంతయ్యారు. నాటి ఆ ఉత్పాతాన్ని నేటికీ ప్రజలు మరిచిపోలేదు. తాజాగా అమెరికా సునామీ హెచ్చరికల విభాగం ఇచ్చిన వార్నింగ్ అప్పుడే సమీప గ్రామాలవారిని, తీర ప్రాంత వాసులను తీవ్ర భయాందోళనలో ముంచెత్తుతోంది. అనేకమంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. హవాయి దీవుల కోస్తా ప్రాంతమంతా భయానక వాతావరణం ఏర్పడినట్టు తెలుస్తోంది.