H5N1 Bird Flu: ముంచుకొస్తున్న బర్డ్‌ఫ్లూ
అమెరికాలో ఆవుల్లో హెచ్5ఎన్1 వైరస్;
కొవిడ్ సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మానవాళిపై మరో మహమ్మారి పంజా విసరబోతున్నదా అన్న ప్రశ్న మరోసారి తలెత్తింది. ప్రపంచమంతటా కోవిడ్–19 మహ మ్మారి సృష్టించిన విలయం అందరికీ తెలిసిందే. లక్షల మంది బలయ్యారు. అలాంటి ప్రాణాంతక మహమ్మారి మరొకటి మానవులకు వ్యాపించే అవకాశాలు అధికంగా ఉన్నాయని అమెరికా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.అయితే, ఈసారి కొత్తగా ఏ వైరస్ పుట్టుకు రావాల్సిన అవసరం లేదని, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పక్షులు, కోళ్లలో వ్యాపిస్తున్న బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్1 రకం వైరస్.. మహమ్మారిగా మారి దాడి చేసే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమెరికాలో ఆవుల మందల్లో హెచ్5ఎన్1 వైరస్ సోకుతున్నది. కాన్సాస్, న్యూమెక్సికో, టెక్సాస్, ఓహియో, ఇడాహో, మిషిగన్‌లో పాడి పశువులకు బర్డ్‌ఫ్లూ సోకినట్టు గుర్తించారు. పక్షుల ద్వారా పశువులకు వైరస్ సోకినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు.
టెక్సాస్‌లోని ఓ డెయిరీఫామ్‌లో పని చేసే కార్మికుడికి కూడా బర్డ్‌ఫ్లూ సోకినట్టు గుర్తించారు. వైరస్ సోకిన ఆవులను తాకడం వల్ల అతడు వైరస్ బారిన పడ్డట్టు భావిస్తున్నారు. పశువుల నుంచి మనిషికి బర్డ్‌ఫ్లూ సోకడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు 2022లోనూ అమెరికాలోని కొలరాడోలో ఒక వ్యక్తికి వైరస్ సోకినప్పటికీ అతడికి కోళ్ల నుంచి సోకింది.
బర్డ్‌ఫ్లూని ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అని పిలుస్తారు. ఇందులో అనేక వేరియంట్లు ఉన్నప్పటికీ హెచ్5ఎన్1, హెచ్7ఎన్9కు మాత్రమే మనుషులకు సోకే సామర్థ్యముంది. హెచ్5ఎన్1 వైరస్‌ను తొలిసారి 1996లో చైనాలోని పక్షుల్లో గుర్తించారు. ఆ తర్వాత ఏడాది హాంకాంగ్‌లో వైరస్ పక్షుల నుంచి మనుషులకు వ్యాపించింది. 18 మంది వైరస్ బారిన పడగా ఆరుగురు మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2003 నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 887 మంది హెచ్5ఎన్1 బర్డ్‌ఫ్లూ బారిన పడగా 462 మంది మరణించారు. వైరస్ బారిన పడుతున్న ప్రతి 100 మందిలో 52 మంది మరణిస్తున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. కొవిడ్‌లో మరణాల రేటు 0.1 శాతం మాత్రమే ఉన్నప్పటికీ లక్షలాది మందిని బలిగొన్నది. హెచ్5ఎన్1లో మరణాల రేటు 52 శాతం కాబట్టి ఇది కొవిడ్ కంటే 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏప్రిల్ 1న ఈ కేసు బయటపడినట్లు యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) నిర్ధారించింది. బాధితుడి కళ్లు ఎర్రగా మారాయి. బర్డ్‌ఫ్లూ లక్షణాల్లో కండ్ల కలక కూడా ఒకటి. అమెరికాలో మనిíÙకి బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్1 వేరియంట్ సోకడం ఇది రెండో కేసు. బాధితుడిని ఐసోలేషన్‌కు తరలించి, చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు. వైరస్ సోకినట్లు వెంటనే గుర్తించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.