USA: ఇల్లినాయిస్ ఆక్రమణకు టెక్సాస్ బలగాలు మోహరింపు
అక్రమ వలసదారుల కట్టడికే నని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదన
అమెరికాలో 1861 నాటి అంతర్యుద్ధం పునరావృతం అయ్యే ప్రమాదం ముంచుకొస్తోంది. ఇల్లినాయిస్‌ని టెక్సాస్ ఆక్రమించుకోనున్నదన్న వార్తలు అమెరికా వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇందుకు సాక్ష్యంగా నేషనల్ గార్డుకు చెందిన 400 సైనిక బలగాలు ఎల్ పాసోలోని ఫోర్ట్ బ్లిస్ నుంచి అమెరికా సైనిక విమానంలో సోమవారం సాయంత్రం షికాగోకు తరలివెళ్లాయి. ఈ బలగాల మోహరింపును రాష్ట్ర డెమోక్రటిక్ నాయకులు, స్థానిక అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీ-17 సైనిక విమానాన్ని ఎక్కుతున్న బలగాల ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ మోహరించడానికి వెళుతున్న బలగాలు అని రాసుకొచ్చారు. ఈ చర్యను టెక్సాస్‌కు చెందిన డెమోక్రాట్లు తీవ్రంగా తప్పుపట్టారు. 1861 నాటి అంతర్యుద్ధాన్ని రిపబ్లికన్లు ప్రేరేపిస్తున్నట్లు వారు ఆరోపించారు. 1861 ఘర్షణలలో దాదాపు 7.50 లక్షల మంది మరణించారు.
1861లో బానిసత్వాన్ని రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఇల్లినాయిస్‌కి చెందిన అబ్రహం లింకన్ నాయకత్వంలో పోరాటం సాగగా బానిసత్వాన్ని సమర్థిస్తూ దక్షిణ డెమోక్రాట్లు వారితో ఘర్షణకు దిగారు. ఇప్పుడు ఇల్లినాయిస్‌ని ఆక్రమించుకోవడానికి టెక్సాస్ ప్రయత్నించడం గమనార్హం. 1861 నాటి అంతర్యుద్ధానికి మరోసారి చేరువలో ఉన్నామని ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు ర్యాండీ ఫైన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశంలోని సనాతనవాదులు మరో ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకుంటున్నారని షికాగో మేయర్ బ్రాండన్ జాన్సన్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు షికాగో ప్రజలపైన, యావత్ అమెరికాపైన యుద్ధం ప్రకటించారని ఆయన విమర్శించారు. నేషనల్ గార్డు బలగాల మోహరింపును తక్షణమే అడ్డుకోవడానికి నిరాకరించిన ఇల్లినాయిస్‌లోని ఫెడరల్ జడ్జి ఒకరు దీనిపై గురువారం పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ప్రకటించగా పోర్టుల్యాండ్‌లో బలగాల మోహరింపును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఒరెగాన్‌లోని మరో జడ్జి ఆదేశాలు జారీచేశారు. అయితే నేషనల్ గార్డు బలగాల మోహరింపును రాష్ర్టాలు అడ్డుకుంటే తాను 1807 నాటి తిరుగుబాటు నియంత్రణ చట్టాన్ని ప్రయోగించవలసి వస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.