Global Debt Crisis : ప్రపంచం మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది..మరి ఈ దేశాలకు అప్పు ఇచ్చేదెవరు?
Global Debt Crisis : చైనా ఆఫ్రికా దేశాల నుండి పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు వంటి అనేక దేశాలకు భారీగా అప్పులు ఇస్తోంది. కానీ, ఆ చైనా దేశమే ఏకంగా 18 ట్రిలియన్ డాలర్ల అప్పులో ఉంది. అలాగే, అమెరికాకు జపాన్ అప్పు ఇచ్చింది, కానీ ఆ జపాన్ కూడా అప్పుల్లో కూరుకుపోతోంది. ప్రపంచంలోని అనేక దేశాలకు ఆర్థిక సహాయం అందించే అమెరికా సైతం, ప్రపంచంలోనే అతి ఎక్కువ అప్పు ఉన్న దేశంగా అపఖ్యాతి పాలైంది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు అప్పుల్లో మునిగిపోవడం నిజమే. మరి, ఒక దేశం మరొక దేశానికి అప్పు ఇస్తున్నప్పుడు, ఈ అప్పులు మొత్తంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు అప్పు ఇస్తున్నది ఎవరనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి.
300 ట్రిలియన్ డాలర్ల అప్పులో ప్రపంచం ప్రస్తుతం అన్ని దేశాలు ఒకదానికొకటి అప్పులు ఇచ్చుకుంటూ పోతున్నాయి. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక అప్పుల వలయం ఏర్పడింది. ఈ పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మునిగిపోయే అంచుకు నెడుతోందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా చెబుతున్నారు. లింక్డ్‌ఇన్‌లో ఆయన చేసిన పోస్ట్ ప్రకారం.. అప్పులు తగ్గడం లేదు, బదులుగా పెరుగుతూనే పోతున్నాయి. ఆయన అంచనా ప్రకారం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ కేవలం 100 ట్రిలియన్ డాలర్లు మాత్రమే. కానీ, ప్రపంచం మొత్తం 300 ట్రిలియన్ డాలర్ల అప్పులో కూరుకుపోయింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే పది రెట్లు ఎక్కువ అప్పు.
సామాన్య ప్రజలే అప్పు ఇచ్చేవాళ్లు! దేశాల ఆర్థిక వ్యవస్థలు పెరగడానికి డబ్బు అవసరం. అందుకే ప్రభుత్వాలు వివిధ రకాల బాండ్లు లేదా రుణ పత్రాల ద్వారా సామాన్య ప్రజలు, ప్రైవేట్ సంస్థల నుంచి అప్పు తీసుకుంటాయి. ఉదాహరణకు, అమెరికా దాదాపు 36 ట్రిలియన్ డాలర్ల అప్పులో ఉంది. ఇందులో సుమారు 70% అప్పు సామాన్య ప్రజలు లేదా ప్రైవేట్ సంస్థలకు చెల్లించాల్సినదే.
అమెరికా ఒక్కటే కాదు, చాలా దేశాల అప్పుల కథ ఇదే. వాటి పబ్లిక్ డెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు, ప్రభుత్వాలు ఎక్కువ డబ్బు ఆశతో అవసరానికి మించి నోట్లను ముద్రిస్తాయి. దీని ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది.
ఆర్థిక సంక్షోభానికి కారణాలు, పరిష్కారం ప్రభుత్వాలు బాండ్లను అమ్మి అప్పు సేకరించడానికి ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తాయి. దీని ప్రభావంతో షేర్ మార్కెట్ పడిపోతుంది. ఇలా ఒక చర్య, దాని ప్రభావం, మళ్లీ ఆ ప్రభావం వల్ల మరో ప్రభావం... ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ గందరగోళ స్థితిలో పయనిస్తోందని ఆర్థిక నిపుణుడు సార్థక్ అహుజా వివరిస్తున్నారు.
ఆయన ప్రకారం ప్రభుత్వాలు ముద్రించే కరెన్సీలపై విశ్వసనీయత తగ్గుతున్న నేపథ్యంలో బంగారం, వెండి వంటి సాంప్రదాయ విలువైన లోహాలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితుల్లో వాటి అవసరం మునుపెన్నడూ లేనంతగా పెరిగిందని నిపుణుల అభిప్రాయం. అందుకే వాటి ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.