Titanic: ఆ 34 మందీ లేకపోతే.. ఆనాడు టైటానిక్ షిప్ లో ఉన్నవారంతా..!
Titanic: టైటానిక్ గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు..;
Titanic Engineers (tv5news.in)
Titanic: టైటానిక్.. ఈ ఒక్కపేరుపై ఎన్నో కథలు, ఎన్నో పుస్తకాలు. టైటానిక్‌కు జరిగిన ట్రాజెడీని మర్చిపోయి మరీ.. అందులోని ప్రేమకథను గుర్తుపెట్టుకునేలా చేశాడు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్. కానీ జేమ్స్ మనకు చూపించిన దానికంటే టైటానిక్ కథ చాలా పెద్దది. టైటానిక్ గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు..
టైటానిక్ నిర్మాణం అప్పట్లో ఓ సంచలనం. అంత పెద్ద నౌక, అంతమంది నౌకర్లు, ఇవన్నీ ప్రజలను ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాయి. దాని నిర్మాణం అంత సంచలనంగా మారింది కాబట్టే టైటానిక్ మునిగిపోయినప్పుడు కూడా అంతే సంచలనాన్ని సృష్టించింది. 'వైట్ స్టార్ లైన్' సంస్థ ఛైర్మన్ జే బ్రూస్ ఇస్మాయ్ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే టైటానిక్. ఈ నౌక నిర్మాణానికి పదేళ్లు పట్టింది.
టైటానిక్ నిర్మాణంలో ఉపయోగించిన ప్రతీ ఒక్క వస్తువు. దాని డిజైన్.. అన్ని చాలా ప్రత్యేకం. మొత్తం టైటానిక్‌ను తయారు చేయడం కోసం 1500 కార్మికులు కష్టపడ్డారు. కానీ టైటానిక్ ప్రజల వద్దకు వెళ్లక ముందే దానికోసం పనిచేసిన పలువురు కార్మికుల ప్రాణాలు తీసింది. దీని నిర్మాణ దశలోనే ఆరుగురు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు షిప్‌యార్డ్ వర్క్‌షాప్, షెడ్‌లలో ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ ప్రారంభానికి కొన్నిరోజుల ముందు పడిపోతున్న చెక్కపలక తగిలి ఓ కార్మికుడు మృతి చెందాడు.
కార్మికులకు మాత్రమే కాదు టైటానిక్ కోసం పనిచేసిన ఇంజనీర్లు కూడా దీనికోసం ప్రాణత్యాగం చేశారు. టైటానిక్ ప్రమాద సమయంలో దీని నిర్మాణం కోసం కష్టపడ్డ 34 మంది ఇంజనీర్లు, కార్మికులు అదే నౌకలో ప్రయాణం చేస్తున్నారు. అనుకోకుండా ప్రమాదం ఎదురైనప్పుడు దాని నుండి ప్రయాణికులను కాపాడడానికి వారి ప్రాణాలను సైతం లేక్కచేయకుండా ముందడుగు వేశారు.
అలా టైటానిక్ కోసం ప్రాణాలు అర్పించిన ఇంజనీర్లు, కార్మికుల త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ సౌతంప్టన్‌లోని ఈస్(ఆండ్య్రూస్) పార్క్‌లో 'టైటానిక్ ఇంజినీర్స్ మెమోరియల్' పేరిట ఓ స్మారక వనాన్ని నిర్మించారు. 1914లో దీని ప్రారంభం జరిగింది. టైటానిక్ ప్రమాదం నుండి బయటపడ్డ వారు మాత్రమే కాకుండా ఎన్నో లక్షల మంది ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.
2010లో ఈ స్మారక వనాన్ని పునరుద్ధరించారు. అంతే కాకుండా టైటానిక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రఖ్యాత వాయొలిన్ కళాకారుడు వాలెస్ హార్ట్‌లీ, అతడితో పాటు ఉన్న మరికొందరు సంగీత కళాకారుల మరణానికి గుర్తుగా 'టైటానిక్ మ్యూజిషియన్స్ మెమోరియల్' కూడా నిర్మించారు. టైటానిక్ నిర్మాణం, టైటానిక్ కట్టాలన్న ఆలోచన ఎంత గొప్పవి కాకపోతే ఇన్ని సంవత్సరాలైనా ఇంకా దాని గురించి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇది గుర్తుపెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ప్రాణత్యాగం చేసిన ఆ 34 మంది కూడా.