Renee Good: ‘ఐస్’ ఏజెంట్ కాల్పుల్లో మహిళ మృతి.. ట్రంప్, వ్యాన్స్ ఏమన్నారంటే

అధికారిని కారుతో తొక్కించేందుకు ప్రయత్నించిందన్న ట్రంప్ , ‘ఉన్మాద వామపక్షవాది’ అన్న జేడీ వ్యాన్స్

Update: 2026-01-09 04:30 GMT

అమెరికాలోని మిన్నియాపాలిస్ నగరంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారి జరిపిన కాల్పుల్లో ఒక మహిళ మరణించిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ మంటలు రేపుతోంది. ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన సామూహిక ఇమ్మిగ్రేషన్ అణచివేత చర్యల్లో భాగంగా జరిగిన ఈ ఐదవ మరణం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐస్ ఏజెంట్లు ఒక కారును చుట్టుముట్టడం, ఆ కారు అక్కడి నుంచి కదిలే ప్రయత్నం చేయగా ఒక అధికారి నేరుగా విండ్‌షీల్డ్‌లోకి కాల్పులు జరపడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత కారు నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న వాహనాలను ఢీకొట్టింది.

హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోమ్ ఈ ఘటనను ‘డొమెస్టిక్ టెర్రరిజం’ (దేశీయ ఉగ్రవాదం)గా అభివర్ణించారు. ఆ మహిళ ఉద్దేశపూర్వకంగానే తన వాహనాన్ని ఆయుధంగా మార్చుకుని అధికారులపైకి దూసుకెళ్లిందని ఆమె పేర్కొన్నారు. మిన్నియాపాలిస్ సిటీ కౌన్సిల్, మేయర్ జాకబ్ ఫ్రే ఈ వాదనను కొట్టిపారేశారు. రెనీ గుడ్ ఒక సాధారణ పౌరురాలని, ఆమె తన పొరుగువారిని పరామర్శించేందుకు వెళ్తుండగా ఫెడరల్ ఏజెంట్లు అకారణంగా కాల్పులు జరిపారని వారు మండిపడ్డారు. మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ కూడా దీనిపై నిష్పక్షపాత విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనను సమర్థిస్తూ, ఆమె ప్రవర్తన అత్యంత దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. "ఆమె అధికారిని తొక్కించేందుకు ప్రయత్నించలేదు, నిజంగానే తొక్కించింది" అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఇంకాస్త తీవ్రంగా స్పందిస్తూ రెనీ గుడ్ ఒక ‘ఉన్మాద వామపక్షవాది’ అని, ఆమె ఫెడరల్ అధికారుల పనికి ఆటంకం కలిగిస్తూ వారిని చంపేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. అధికారులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపారని ఆయన వెనకేసుకొచ్చారు.

రెనీ గుడ్ మృతికి నిరసనగా మిన్నియాపాలిస్‌తో పాటు న్యూయార్క్ వంటి నగరాల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆమెను ఒక కవయిత్రిగా, ముగ్గురు పిల్లల తల్లిగా స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన ప్రదేశానికి కేవలం ఒక మైలు దూరంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసును ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది.

Tags:    

Similar News