Donald Trump : ట్రంప్ నుంచి భారత్‌కు గుడ్‌న్యూస్..200 ఉత్పత్తులపై టారిఫ్ తగ్గింపు.
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశానికి ఒక ముఖ్యమైన ఆర్థికపరమైన ఊరట కల్పించారు. భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే అనేక రకాల మసాలాలు, టీ పై ఉన్న టారిఫ్‌లను తగ్గించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో భారతీయ మసాలా వ్యాపారులకు, టీ ఉత్పత్తిదారులకు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు సుమారు ఒక బిలియన్ డాలర్ల (దాదాపు 10 వేల కోట్ల రూపాయల) విలువైన లబ్ధి చేకూరనుంది. టారిఫ్‌ల కారణంగా అమెరికాలో పెరిగిన ద్రవ్యోల్బణం, వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ట్రంప్ సుమారు 200 ఫుడ్, వ్యవసాయ, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను సడలించారు. ఈ రాయితీ పొందిన ఉత్పత్తుల జాబితాలో ప్రధానంగా..నల్ల మిరియాలు, లవంగాలు, జీలకర్ర, యాలకులు, పసుపు, అల్లం వంటి అనేక మసాలాలు, పలు రకాల టీ, కాఫీ, జీడిపప్పు వంటి పలు రకాల పండ్లు, గింజలు, మామిడి ఉత్పత్తులు, పండ్ల గుజ్జులు వంటివి ఉన్నాయి.
భారత్ 2024లో అమెరికాకు 50 కోట్ల డాలర్ల విలువైన మసాలాలను, 8.3 కోట్ల డాలర్ల విలువైన టీ, కాఫీలను ఎగుమతి చేసింది. ఈ తగ్గింపు భారత్ 5.7 బిలియన్ డాలర్ల వ్యవసాయ ఎగుమతుల్లో సుమారు ఐదో వంతుకు వర్తిస్తుంది. ఈ టారిఫ్ తగ్గింపు భారతీయ వ్యవసాయ రంగానికి పెద్ద ఊరట అయినప్పటికీ, కొన్ని ముఖ్యమైన ఎగుమతి ఉత్పత్తులకు మాత్రం ఈ రాయితీ వర్తించలేదు. రొయ్యలు, ఇతర సముద్ర ఆహార రకాలు, బస్మతి బియ్యం వంటి అధిక విలువ గల షిప్‌మెంట్‌లు ఉన్నాయి.
వీటితో పాటు భారతీయ రత్నాలు, ఆభరణాలు, దుస్తులపై ఉన్న 50 శాతం భారీ టారిఫ్‌లు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ టారిఫ్‌లు తగ్గాలంటే, రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించి, అమెరికా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయాలనే ట్రంప్ డిమాండ్‌తో కూడిన ఒక విస్తృత వాణిజ్య ఒప్పందం కుదరాల్సి ఉంటుంది.
న్యూఢిల్లీలోని అధికారుల ప్రకారం సుమారు 50 ప్రాసెస్ చేసిన ఆహార కేటగిరీలకు అత్యధికంగా లాభం చేకూరనుంది. గత సంవత్సరం వీటి ఎగుమతి విలువ దాదాపు 491 మిలియన్ డాలర్లుగా ఉంది. కాఫీ, టీ సారం, కోకో ఆధారిత ఉత్పత్తులు, పండ్ల రసాలు, కూరగాయల మైనాలు, 359 మిలియన్ డాలర్ల విలువైన మసాలాలకు తర్వాతి స్థానంలో లాభం అంచనా వేశారు.48 రకాల పండ్లు, గింజలు (కొబ్బరి, జామ, జీడిపప్పు, అరటిపండ్లు మొదలైనవి) కూడా లాభపడనున్నాయి.
భారత ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ టారిఫ్ తగ్గింపు వల్ల భారతీయ ఎగుమతిదారులు తమ పోటీదారులతో సమాన అవకాశాలు పొందగలుగుతారని గతంలో అధిక టారిఫ్‌ల కారణంగా నష్టపోతున్నారని తెలిపారు. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనే. ద్రవ్యోల్బణం కారణంగా అమెరికన్ ఓటర్లు అసంతృప్తిగా ఉన్నారు. దీని ఫలితంగా రిపబ్లికన్ పార్టీ ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. పెరుగుతున్న ధరలపై ప్రజల ఆగ్రహాన్ని తగ్గించడానికి, ట్రంప్ టారిఫ్ ఆదాయాన్ని ఉపయోగించి 2,000 డాలర్ల చెక్కులు పంపిణీ చేయడం వంటి చర్యలను కూడా ప్రతిపాదించారు. ద్రవ్యోల్బణం పెరగడానికి టారిఫ్‌లు కారణం కాదని ట్రంప్ చెబుతున్నప్పటికీ, అమెరికన్ పరిశ్రమల వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి.