అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండవ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత, భౌగోళిక రాజకీయ సమీకరణల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చిరకాల ప్రత్యర్థి మాస్కోను ట్రంప్ దారికి తెచ్చుకుంటున్నారు. ఉక్రెయిన్ తో యుద్ధం ముగింపు దిశగా జరుగుతున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం. తాజాగా, రక్షణ వ్యయాలకు సంబంధించి ట్రంప్ చేసిన ప్రతిపాదనకు పుతిన్ సానుకూలంగా స్పందించడం విశేషం. అమెరికా ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు స్వాగతించారు. ఇదొక మంచి ఆలోచన అని కొనియాడారు. ఇటువంటి ఫలితాలను అన్వేషించడానికి మాస్కో చర్చలకు సిద్ధమని కూడా ప్రకటించారు. అదే సమయంలో చైనా మాత్రం ట్రంప్ ప్రతిపాదనను వ్యతిరేకించింది. అమెరికా, రష్యాలు తమకు నచ్చినట్లు చేసుకోవచ్చు. ఈ విషయంలో బీజింగ్ కు ఆసక్తిలేదు అని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జియాన్ చెప్పారు. చైనా రక్షణ వ్యయం పరిమితం. దాని సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలు కాపాడుకోవడం అవసరం అని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై పుతిన్ స్పందిస్తూ, అమెరికా అలోచన మంచిదే. స్వాగతిస్తున్నాను. అమెరికా రక్షణ బడ్జెట్ 50 శాతం తగ్గిస్తుంది. మేమూ తగ్గిస్తాం. చైనా కూడా ఇందుక అంగీకరిస్తే ముందడుగు పడుతుంది అని అన్నారు. కాగా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా తన రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచింది. రష్యా జీడీపీలో దాదాపుగా 9శాతం ఉన్నాయని పుతిన్ అంగీకరించారు. ఈ పరిణామాల్ని చూస్తుంటే ఉక్రెయిన్ తో యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది.