Trump-Jinping: 6 ఏళ్ల తర్వాత ట్రంప్-జిన్‌పింగ్ తొలిసారి భేటీ
దక్షిణ కొరియా వేదికగా సమావేశం
దక్షిణ కొరియా వేదికగా ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. ఆరేళ్ల తర్వాత ఇద్దరు నాయకులు కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. బుసాన్‌లో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
జిన్‌పింగ్‌ను కలిసిన తర్వాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరం కలిసి విజయవంతమైన సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇద్దరి మధ్య ఎల్లప్పుడూ గొప్ప సంబంధం ఉందని.. ఒకరినొకరు బాగా తెలుసు అని చెప్పారు. జిన్‌పింగ్ చాలా కఠినమైన చర్చలు జరుపుతారని.. ఇది మంచిది కాదన్నారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. జిన్‌పింగ్ తన స్నేహితుడు అని చెప్పారు. చైనాకు గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. చాలా కాలం పాటు ఇద్దరం అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉంటామని భావిస్తున్నట్లు తెలిపారు. మాతో కలిసి ఉండడం గౌరవం అన్నారు.
ఇక జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ట్రంప్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి చూడటం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ట్రంప్ తిరిగి ఎన్నికైన తర్వాత మూడుసార్లు ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు గుర్తుచేశారు. ఆయా లేఖల ద్వారా సన్నిహిత సంబంధాలు కొనసాగాయని వెల్లడించారు. ఉమ్మడి మార్గదర్శకత్వంలో అమెరికా-చైనా సంబంధాలు స్థిరంగా ఉన్నాయని.. అప్పుడప్పుడు ఘర్షణలు పడటం సాధారణమే అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.
సుంకాలు కారణంగా అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల చైనాపై భారీగా ట్రంప్ సుంకాలు విధించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇద్దరు నాయకులు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉంటే ట్రంప్-జిన్‌పింగ్ సమావేశంపై బీజింగ్ కీలక ప్రకటన విడుదల చేసింది. ‘‘సానుకూల ఫలితాల’’ కోసం కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ పేర్కొన్నారు.
ఐదు రోజుల ఆసియా పర్యటన కోసం ట్రంప్ సోమవారం మలేషియా వచ్చారు. మలేషియా పర్యటన తర్వాత జపాన్‌కు వెళ్లారు. అనంతరం ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు దక్షిణ కొరియాకు వచ్చారు. దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని తిరిగి అమెరికాకు వెళ్లిపోనున్నారు.
ఇదిలా ఉంటే బుధవారం ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకారం సీఈవోల సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో మోడీతో జరిగిన సంభాషణను బహిర్గతం చేశారు. ఒక తండ్రిలా చక్కదిద్దాల్సిన మోడీ.. ఒక హంతకుడిలా ప్రవర్తించారని.. మోడీ నరకం లాంటి కఠినాత్ముడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.