Trump-Greenland: గ్రీన్‌లాండ్‌పై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ముదురుతున్న గ్రీన్‌లాండ్ వివాదం
గ్రీన్‌లాండ్ వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడానికి అమెరికాకు అనుమతి లభించేంత వరకు యూరోపియన్ దేశాలపై సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ వార్నింగ్‌ను మిత్ర దేశాలు తీవ్రంగా ఖండించాయి.
తాజాగా ఇదే వ్యవహారంపై ట్రంప్ మాట్లాడారు. గ్రీన్‌లాండ్‌ను రష్యా ముప్పు నుంచి తప్పించడంలో డెన్మార్క్ విఫలమైందన్నారు. ప్రస్తుతం సమయం ఆసన్నమైందని.. అది జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు. డెన్మార్క్ విఫలం కావడంతోనే అమెరికా జోక్యం చేసుకుంటుందని తెలిపారు. గ్రీన్‌లాండ్ నుంచి రష్యా ముప్పును దూరం చేయాలని నాటో 20 ఏళ్లుగా డెన్మార్క్‌కు చెబుతోందని… కానీ దురదృష్టవశాత్తు డెన్మార్క్ ఆ విషయంలో విఫలమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ పెట్టారు. అమెరికా భద్రతా దృష్ట్యా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడం అవసరం అని… చైనా, రష్యా ఆక్రమణ నుంచి కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ పేర్కొన్నారు.
ఇక ట్రంప్ ప్రకటనపై యూరోపియన్ దేశాలు, నాటో నాయకత్వం తిరుగుబావుటా ఎగరవేశారు. ట్రంప్ ప్రకటనను తీవ్రంగా తప్పుపట్టాయి. తాజాగా యూరోపియన్ దేశాధినేతలంతా బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో అత్యవసర సమావేశమై ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. యూరోపియన్ దేశాలపై ట్రంప్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని.. ఇలాగైతే అమెరికన్ కంపెనీలను యూరోపియన్ మార్కెట్ నుంచి మినహాయించాలని కోరనున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా అమెరికాపై 93 బిలియన్ యూరోల సుంకాలు విధించాలని ఫ్రాన్స్ భావిస్తోంది. ఇక ఈ వారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా ట్రంప్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేందుకు యూరోపియన్ దేశాలు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇక ట్రంప్‌కు యూకే ప్రధాని స్టార్మర్ ఫోన్ చేసి అలాంటి చర్యలు తప్పు అని చెప్పినట్లుగా తెలుస్తోంది. అట్లాంటిక్ సంబంధాలు అస్థిరపరిచే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. అలాగే డానిష్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డేర్ లేయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో విడివిడిగా స్టార్మర్ ఫోన్ చేసి మాట్లాడారు. గ్రీన్‌లాండ్ విషయంలో ఐక్యతకు పిలుపు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి గ్రీన్‌లాండ్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికాతో యూరోపియన్ దేశాలు పరోక్ష యుద్ధానికి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.