Venezuela Oil: వెనెజువెలా చమురుపై ట్రంప్ కన్ను.. స్వాధీనం చేసుకుంటామని వెల్లడి
ఆదాయాన్ని 2 దేశాల కోసం ఖర్చు చేస్తామని హామీ
వెనెజువెలా చమురుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం 30-50 మిలియన్ బ్యారెళ్ల చమురును అమెరికాకు అప్పగించనున్నట్లు ప్రకటించారు. దీనిపై వచ్చే ఆదాయం తన నియంత్రణలో ఉంటుందని ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు.
వెనెజువెలాపై సైనిక చర్య చేపట్టి.. దేశాధ్యక్షుడిగా ఉన్న నికోలస్ మదురోను బంధించిన కొన్ని రోజులకే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘వెనెజువెలాలోని తాత్కాలిక అధికారులు అధిక నాణ్యత గల 30-50 మిలియన్ బ్యారెళ్ల చమురును యూఎస్‌కు అప్పగించనున్నారు. ఈ ప్రకటన చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మార్కెట్ ధరకే ఈ చమురును విక్రయిస్తాం. ఆ డబ్బు నా నియంత్రణలోనే ఉంటుంది’ అని రాసుకొచ్చారు. ఆ డబ్బును వెనెజువెలా, అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని తెలిపారు. ఈ చమురు అప్పగింత ప్రక్రియ వెంటనే జరగనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రణాళికను తక్షణమే అమలుచేయాలని ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్‌కు తాను ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. చమురు నిల్వలను నౌకల ద్వారా రవాణా చేసి.. నేరుగా అమెరికా ఓడరేవులలో దించనున్నట్లు ట్రంప్ (Donald Trump) తెలిపారు.
రిలయన్స్ షేరుకు రష్యా చమురు సెగ
ఇదిలాఉండగా.. వెనెజువెలాకు చెందిన చమురు కంపెనీలతో శుక్రవారం వైట్‌హౌస్ కీలక సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఓవల్ ఆఫీస్‌లో జరిగే ఈ సమావేశంలో ఎక్సాన్, చెవ్రాన్, కోనోకోఫిలిప్స్ వంటి చమురు కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నట్లు పేర్కొన్నాయి.
రిపబ్లికన్లకు ట్రంప్ వార్నింగ్..
ఇక, సొంత పార్టీ సభ్యులను ట్రంప్ బహిరంగంగా హెచ్చరించారు. 2026 మిడ్‌టర్మ్ ఎలక్షన్స్‌లో పార్టీ పనితీరు పైనే తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. చట్టసభ సభ్యులకు ఇచ్చిన విందులో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రతినిధుల సభలో మెజారిటీ కోల్పోతే.. తన అభిశంసనను డెమోక్రాట్లు కోరతారని వ్యాఖ్యానించారు. అందుకే మిడ్‌టర్మ్ ఎలక్షన్స్‌లో రిపబ్లికన్లు కచ్చితంగా గెలవాలన్నారు.