US: అమెరికాలో దారుణం.. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య
తుపాకీ హింసపై మాట్లాడుతుండగానే హత్య
అమెరికాలో రాజకీయ హింస మరోసారి పడగ విప్పింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య అనుచరుడు, ప్రముఖ కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ (31) దారుణ హత్యకు గురయ్యారు. తుపాకీ హింస, సామూహిక కాల్పులపై ప్రేక్షకుల నుంచి ప్రశ్నలకు సమాధానమిస్తున్న సమయంలోనే ఆయనపై కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఉటా రాష్ట్రంలోని ఓరెమ్ నగరంలో ఉన్న ఉటా వ్యాలీ యూనివర్సిటీలో బుధవారం ఈ ఘోరం జరిగింది. 'టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ' అనే యువజన సంస్థ వ్యవస్థాపకుడైన చార్లీ కిర్క్, తన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి తుపాకీ హింసకు సంబంధించి ప్రశ్నలు అడుగుతుండగా, కిర్క్ సమాధానం ఇస్తున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఒకే ఒక్క తూటా కిర్క్ మెడ ఎడమ భాగంలోకి దూసుకెళ్లడంతో ఆయన కుప్పకూలిపోయారు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు.
ఈ ఘటనపై ఓరెమ్ నగర మేయర్ డేవిడ్ యంగ్ మాట్లాడుతూ, నిందితుడు ఇంకా పట్టుబడలేదని తెలిపారు. తొలుత ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ, అతను నిందితుడు కాదని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. కిర్క్ మృతిని డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా ధ్రువీకరించారు. "చార్లీ కిర్క్ ఒక గొప్ప వ్యక్తి, ఒక లెజెండ్. అమెరికాలోని యువత హృదయాన్ని ఆయన అర్థం చేసుకున్నంతగా మరెవరూ చేసుకోలేరు" అంటూ నివాళులర్పించారు.
ఈ ఘటన అమెరికాలో నానాటికీ పెరిగిపోతున్న రాజకీయ హింసకు అద్దం పడుతోంది. కిర్క్ యూనివర్సిటీ పర్యటనపై ముందు నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆయనను క్యాంపస్‌లోకి అనుమతించవద్దని కోరుతూ దాదాపు 1000 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయినప్పటికీ, వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తూ యూనివర్సిటీ యాజమాన్యం కార్యక్రమానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో జరిగిన హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీలకు చెందిన పలువురు నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.