Donald Trump : ప్రపంచ మార్కెట్లో ముడి చమురు సునామీ..అగ్రరాజ్యం వ్యూహానికి బెంబేలెత్తుతున్న చమురు దేశాలు.

Update: 2026-01-07 07:00 GMT

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నారు. వెనిజులాలో అమెరికా సైన్యం జరిపిన మెరుపు దాడిలో అధ్యక్షుడు నికోలస్ మాదురో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం జరిగిన కొన్ని రోజులకే, వెనిజులాకు చెందిన సుమారు 30 నుంచి 50 మిలియన్ బారెళ్ల అత్యుత్తమ నాణ్యత గల ముడి చమురును అమెరికాకు అప్పగించేలా అక్కడి తాత్కాలిక అధికారులతో ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చమురును అంతర్జాతీయ మార్కెట్ ధరకు విక్రయించి, ఆ సొమ్మును అమెరికా, వెనిజులా ప్రజల ప్రయోజనాల కోసం తన పర్యవేక్షణలో ఖర్చు చేస్తామని ట్రంప్ ప్రకటించారు.

ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పతనం కావడం మొదలైంది. ప్రస్తుతం అమెరికన్ క్రూడ్ ఆయిల్ ధర ఒక శాతం తగ్గి 56.45 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్ క్రూడ్ ధర 60.18 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెనిజులా చమురు మార్కెట్లోకి వస్తే, ముడి చమురు ధరలు జూన్ నాటికి బారెల్‌కు 50 డాలర్లకు పడిపోవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేస్తోంది. ఇదే జరిగితే భారత్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇది సామాన్య ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

అమెరికా సైన్యం జరిపిన ఈ ఆపరేషన్ వెనిజులాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ దాడిలో సుమారు 24 మంది భద్రతా సిబ్బందితో పాటు డజన్ల కొద్దీ పౌరులు మరణించినట్లు వెనిజులా అటార్నీ జనరల్ ప్రకటించారు. క్యూబా కూడా తన సైనిక సిబ్బంది చనిపోయినట్లు ధృవీకరించింది. అయితే, మాదురోపై 2020 నుంచే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాద ఆరోపణలు ఉన్నాయని, అందుకే ఈ చర్య తీసుకున్నామని ట్రంప్ సమర్థించుకున్నారు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ మాత్రం అమెరికా హెచ్చరికలను తీవ్రంగా ఖండించారు.

వెనిజులాలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను ఎలా వినియోగించుకోవాలో చర్చించేందుకు వైట్ హౌస్ సిద్ధమైంది. రాబోయే శుక్రవారం అమెరికాలోని ప్రముఖ చమురు ఉత్పత్తి సంస్థల సీనియర్ అధికారులతో ట్రంప్ సర్కార్ సమావేశం కానుంది. వెనిజులా చమురు రంగంలో అమెరికా పెట్టుబడులను పెంచడం, అక్కడి టెక్నాలజీని మెరుగుపరచడం ద్వారా చమురు ఉత్పత్తిని పెంచాలని ట్రంప్ యోచిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు కేవలం మిలియన్ బారెళ్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్న వెనిజులా సామర్థ్యాన్ని పెంచితే, ప్రపంచ చమురు మార్కెట్ అమెరికా గుప్పిట్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News