H-1B Visa: హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజుపై వైట్‌హౌస్ క్లారిటీ

ప్రస్తుత వీసాదారులకు, రెన్యూవల్స్‌కు ఇది వర్తించదని స్పష్టీక‌ర‌ణ‌

Update: 2025-09-21 00:45 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా విధానంలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టారు. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే లక్ష్యంతో కొత్తగా జారీ చేసే హెచ్-1బీ వీసాలపై భారీగా ఫీజు విధించే కీలక ప్రకటనపై ఆయ‌న‌ సంతకం చేశారు. దీని ప్రకారం కంపెనీలు కొత్తగా విదేశీ ఉద్యోగి కోసం హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేస్తే లక్ష డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, ఈ నిర్ణయంపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో శనివారం వైట్‌హౌస్ ఒక స్పష్టత ఇచ్చింది. ఈ ఫీజు కేవలం కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా కలిగి ఉన్నవారికి లేదా రెన్యూవల్ చేసుకునే వారికి ఇది వర్తించదని ఓ వైట్‌హౌస్ అధికారి మీడియాకు తెలిపారు. ఇది ఒక్కసారి మాత్రమే చెల్లించాల్సిన ఫీజు అని, రాబోయే లాటరీ సైకిల్ నుంచి అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు.

ఈ విధానం ద్వారా కంపెనీలు విచ్చలవిడిగా వీసాల కోసం దరఖాస్తు చేయడాన్ని (స్పామింగ్) నిరుత్సాహపరచవచ్చని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి టేలర్ రోజర్స్ తెలిపారు. "అమెరికన్ వర్కర్లకే ప్రాధాన్యం ఇస్తామని అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం ఆ దిశగా వేసిన ముందడుగు. వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న కంపెనీలను ఇది నివారిస్తుంది" అని ఆమె అన్నారు.

వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. "ఇకపై పెద్ద టెక్ కంపెనీలు విదేశీ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే బదులు, మా దేశంలోని విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన అమెరికన్లకు శిక్షణ ఇస్తాయి. కంపెనీలు ప్రభుత్వానికి లక్ష డాలర్లు చెల్లించి, ఆ తర్వాత ఉద్యోగికి జీతం ఇవ్వడం ఆర్థికంగా లాభదాయకం కాదు" అని ఆయన వివ‌రించారు.

ఈ నిర్ణయం భారతీయులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్యూ రీసెర్చ్ డేటా ప్రకారం, 2023లో జారీ అయిన మొత్తం హెచ్-1బీ వీసాలలో దాదాపు 73 శాతం మంది భారతీయులే పొందారు. అధిక సంఖ్యలో నైపుణ్యం కలిగిన వలసదారులు ఉండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Tags:    

Similar News