UK-India FTA : భారత్‌తో ఒప్పందం..బ్రిటన్‌కు కాసుల పంట..ఈయూ కన్నా ముందే డీల్ ఓకే

Update: 2026-02-12 06:30 GMT

UK-India FTA : భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. యూరోపియన్ యూనియన్ కంటే ముందే భారత్‌తో ఈ డీల్ కుదుర్చుకోవడం ద్వారా బ్రిటన్ భారీ ప్రయోజనం పొందిందని ఆ దేశ ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. బ్రిటన్ పార్లమెంట్‌లో (హౌస్ ఆఫ్ కామన్స్) జరిగిన చర్చలో ప్రభుత్వం ఈ ఒప్పందం విశిష్టతను, దీనివల్ల లభించే ఆర్థిక లాభాలను వివరించింది. బ్రిటన్ వాణిజ్య శాఖ మంత్రి క్రిస్ బ్రయంట్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ..ఈ ఒప్పందం ఒక గొప్ప విజయమని కొనియాడారు. యూరోపియన్ యూనియన్ కూడా భారత్‌తో ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, తాము ముందుగా డీల్ కుదుర్చుకోవడం వల్ల బ్రిటన్ వ్యాపారవేత్తలకు భారత మార్కెట్‌లో తొలి ప్రాధాన్యత లభిస్తుందని ఆయన తెలిపారు. గతేడాది భారత్-బ్రిటన్ మధ్య 47.2 బిలియన్ పౌండ్ల వాణిజ్యం జరగగా, అది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 15 శాతం పెరిగింది. ప్రస్తుతం భారత్ బ్రిటన్‌కు పదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.

ఈ ఎఫ్‌టీఏ వల్ల 2040 నాటికి బ్రిటన్ జీడీపీ ఏటా 4.8 బిలియన్ పౌండ్ల మేర పెరుగుతుందని అంచనా. అలాగే రెండు దేశాల మధ్య వాణిజ్యం మరో 25.5 బిలియన్ పౌండ్ల మేర వృద్ధి చెందనుంది. భారత్ తన దిగుమతి సుంకాలను (టారిఫ్‌లు) సగటున 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గించనుంది. దీనివల్ల బ్రిటన్ ఎగుమతిదారులకు ఏటా సుమారు 400 మిలియన్ పౌండ్ల పన్ను ఆదా అవుతుంది. పదేళ్లలో ఈ ఆదా 900 మిలియన్ పౌండ్లకు చేరుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. స్మాల్ బిజినెస్ ఫెడరేషన్, HSBC, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి దిగ్గజ సంస్థలు ఈ ఒప్పందానికి మద్దతు తెలపడం విశేషం.

ఈ వారంలోనే ఢిల్లీలో జరిగిన భేటీలో Double Contribution Convention పై రెండు దేశాలు సంతకాలు చేశాయి. దీనివల్ల తాత్కాలికంగా విదేశాల్లో పని చేసే నైపుణ్యం కలిగిన ఉద్యోగులు రెండు దేశాల్లో సామాజిక భద్రతా పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ఐటీ మరియు టెక్ రంగంలోని ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తుంది. దీనివల్ల బ్రిటన్ ఉద్యోగులకు నష్టం జరుగుతుందన్న విపక్షాల ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. ఇది కేవలం ఉన్నత నైపుణ్యం కలిగిన తాత్కాలిక ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

2029 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, 2050 నాటికి భారత్‌లో సుమారు 2.5 కోట్ల మంది సంపన్న వినియోగదారులు ఉంటారని బ్రిటన్ అంచనా వేస్తోంది. ఇంతటి భారీ మార్కెట్‌ను అందిపుచ్చుకోవడమే తమ లక్ష్యమని బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ ఒప్పందంపై బ్రిటన్ పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో సమీక్ష జరుగుతోంది. ఈ వేసవి చివరి నాటికి ఈ ఒప్పందం అధికారికంగా అమలులోకి రానుంది. దీనివల్ల అటు భారతీయ ఎగుమతిదారులకు, ఇటు బ్రిటిష్ వ్యాపారవేత్తలకు సరికొత్త అవకాశాలు లభించనున్నాయి.

Tags:    

Similar News