UAE: యూఏఈలో యూపీ మహిళకు ఉరిశిక్ష అమలు
చిన్నారి మృతి కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ మహిళ షహజాది ఖాన్;
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో భారత మహిళకు ఉరిశిక్ష అమలైంది. చిన్నారి మృతి కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ మహిళ షహజాది ఖాన్‌ను ఉరితీసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందిన ముప్పై మూడేళ్ల మహిళ నాలుగు నెలల చిన్నారిని చంపిన ఆరోపణపై అబుదాబిలో మరణ శిక్షను ఎదుర్కొన్నది. యుఎఇ చట్టాలు, నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 15, 2025న షహజాదీ ఖాన్‌ను ఉరితీశారని విదేశాంగ మంత్రి కోర్టుకు తెలిపారు. కూతురు కోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. షహజాది ఖాన్ ఉరిశిక్ష గురించి ఫిబ్రవరి 28న యుఎఇలోని భారత రాయబార కార్యాలయానికి అధికారిక సమాచారం అందిందని అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) చేతన్ శర్మ తెలిపారు.
షాజాదీ ఖాన్ కేసు వివరాలు..
షహజాది ఖాన్ చట్టబద్ధమైన వీసా పొందిన తర్వాత డిసెంబర్ 2021లో అబుదాబికి వెళ్ళింది. ఫైజ్-నాడియా ఇంట్లో పని చేసుకుంటూ జీవిస్తుంది. ఆగస్టు 2022లో, ఆమె యజమాని ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఆ బాలుడి సంరక్షణ షహజాది ఖాన్ చూసుకుంటోంది. ఈ క్రమంలో సాధారణ టీకాలు వేసిన తర్వాత, ఆ బాలుడు డిసెంబర్ 7, 2022న మృత్యువాత పడ్డాడు. చిన్నారి మృతికి ఖాన్ కారణమని బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిన్నారి హత్యకు ఖాన్ ఒప్పుకున్నట్లు వీడియో రికార్డింగ్‌ను కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే యజమాని కుటుంబం బలవంతంగా తనతో ఒప్పించారని ఖాన్ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు అమెను అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చారు. కోర్టు విచారణ అనంతరం ఫిబ్రవరి 28, 2024న మరణశిక్షను విధించింది. షహజాది ఖాన్ తండ్రి షబ్బీర్ ఖాన్ తన కూతురును రక్షించాలని కేంద్రాన్ని వేడుకున్నాడు. కానీ, ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఉరిశిక్ష అమలు చేసే సమయంలో జైలు అధికారులు షహజాది ఖాన్ ను చివరి కోరిక ఏమిటని అడగగా.. తల్లిదండ్రులతో మాట్లాడలని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడించారు. తాను ఏ తప్పు చేయలేదని తల్లిదండ్రులతో చెప్పి గుండెలవిసేలా రోదించింది. ఆ తర్వాత జైలు అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు.