US: వలసదారుల పిల్లలే ట్రంప్ సర్కార్ టార్గెట్
అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్ట్
కాలిఫోర్నియాలో 30 మంది భారతీయులను అరెస్ట్ చేసారు పోలీసులు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు 30 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్స్‌లతో అక్రమంగా కసెమీ ట్రక్కులు నడుపుతున్నారని, మరికొందరు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్నారని తెలిపారు. ఇంటర్ ఏజెన్సీ కార్యకలాపాల్లో భాగంగా ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించగా, మొత్తం 49 మంది అక్రమ వలసదారులుగా గుర్తించినట్టు యూఎస్ CBP మరో ప్రకటనలో స్పష్టం చేసింది. అక్రమ వలసలు, నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించేందుకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో భాగంగా ఈ అరెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు. అమెరికాలో ఇటీవల జరిగిన ట్రక్కు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ట్రంప్ సర్కారు విదేశీ ట్రక్కు డ్రైవర్లకు వర్క్ వీసా లు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని ఇప్పటికే నిలిపివేసింది. ప్రస్తుతం వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులను నడుపుతున్న వారిపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 మధ్య బోర్డర్ అధికారులు వీరిని అరెస్ట్ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రొటెక్షన్ ఏజెంట్లు నిర్వహించిన ఆపరేషన్‌లో వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీట్రక్కులు నడుపుతున్న 42 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 30 మంది భారత్‌కు చెందినవారు కాగా మిగిలినవారు చైనా, మెక్సికో, రష్యా, తుర్కియే మొదలైన దేశాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు. అనంతరం కాలిఫోర్నియాలోని వాణిజ్య ట్రక్కింగ్ కంపెనీలను లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ఆపరేషన్ ‘హైవే సెంటినెల్’లో మరో ఏడుగురు అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు తెలిపారు. దీంతో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 49కు చేరింది. వలస చట్టాల ఉల్లంఘనలను నివారించడం, దేశంలోని హైవేలను రక్షించడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక అమెరికాలో సగటు భారతీయుడి జీవితం బిక్కుబిక్కుమంటూ గడుస్తోంది. ఇండియన్ల పరిస్థితే కాదు.. అన్ని దేశాల వారి పరిస్థితీ ఇదే. అయితే మనది కొంచెం ఎక్కువ. దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్ణులా.. ఎప్పుడు ఏ చట్టంతో కొడతాడో.. ఏ రూలును ఝులిపిస్తాడో.. ఏ వైపు నుంచి వేటు వేస్తాడోనన్న చందంలా మారింది.
వలసదారుల పిల్లలపై విషం
వలసదారుల పిల్లలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ విషం కక్కారు. 70 ఏళ్లుగా వలసదారులకు పుట్టిన మిలియన్ల మంది పిల్లలు అమెరికాకు చేసింది తక్కువేనని వ్యాఖ్యలు చేశారు. సోమాలియా వలసదారులను ఉదాహరణగా చూపుతూ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందరి పైనా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇన్ని వలస సమూహాల్లో ఏ ఒక్క తరం విజయవంతం కాలేదు. వీరంతా అమెరికాకు చేసింది ఏమీ లేదు. అందుకు సోమాలియా స్పష్టమైన ఉదాహరణ. సంక్షేమ పథకాలను భారీస్థాయిలో వినియోగించుకుంటున్నారు. నేర కార్యకలాపాల్లో వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జన్మతః పౌరసత్వం కల్పించే పద్ధతిని రద్దు చేస్తూ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాన్ని సమర్థించాలని ట్రంప్ యంత్రాంగం అమెరికా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిల్లర్ నుంచి స్పందన వచ్చింది.
వేతనం ఎక్కువుంటేనే హెచ్-1బీ
హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పు చేపట్టేందుకు అమెరికా సిద్ధమైంది. ప్రస్తుతమున్న ర్యాండమ్ లాటరీ విధానానికి స్వస్తి పలికి.. అధిక నైపుణ్యాలు, ఎక్కువ వేతనాలు ఉన్న వ్యక్తులకు ఆ వీసాల జారీలో ప్రాధాన్యమిచ్చే సరికొత్త వ్యవస్థను దాని స్థానంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కొత్త పద్ధతికి సంబంధించిన నిబంధన వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 2027 ఆర్థిక సంవత్సరం హెచ్-1బీ క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్‌కు కూడా ఇదే వర్తిస్తుందని వెల్లడించింది. అమెరికా కార్మికుల ఉద్యోగ అవకాశాలతో పాటు పని పరిస్థితులు, వేతనాలను పరిరక్షించేందుకే నూతన నిబంధనను అమల్లోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. హెచ్-1బీ వీసాల జారీకి ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ చాలా కంపెనీలు విదేశాల నుంచి తక్కువ వేతనాలకే ఉద్యోగులను రప్పించుకుంటున్నాయని గుర్తుచేసింది. ఇప్పుడు ట్రంప్ విధానాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.