US-China Tariff War : అన్నంత పని చేసిన ట్రంప్‌, చూసుకుందామన్నచైనా

అమెరికా 104% టారిఫ్‌లపై చైనా ఫైర్‌;

Update: 2025-04-09 01:45 GMT

 చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ .  తన హెచ్చరికలను బేఖాతరు చేసిన బీజింగ్‌పై ఏకంగా 104శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో ప్రపంచ దేశాలు కంగుతిన్నాయి. కాగా.. అమెరికా విధిస్తున్న సుంకాల పై చైనా ప్రీమియర్‌ లీ కియాంగ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, తగిన విధంగా బదులిచ్చేందుకు తమ వద్ద విధానపరంగా అన్ని ఆయుధాలు ఉన్నాయని వెల్లడించారు. ఐరోపా కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్‌ డిర్‌తో ఫోన్‌ కాల్‌ సందర్భంగా లీ కియాంగ్   ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘సుంకాల పేరుతో అమెరికా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది. దీనిపై మేం చివరి వరకు పోరాడుతాం. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలను రూపొందించాం. వాణిజ్య భాగస్వాములందరిపై ట్రంప్‌ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు.. అమెరికా ఏకపక్షవాదం, రక్షణవాదం, ఆర్థికపరంగా బలవంతపు చర్యలను అద్దం పడుతున్నాయి. దీనికి మేం తప్పకుండా ప్రతిస్పందిస్తాం. సొంత ప్రయోజనాల కోసమే గాక.. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను కాపాడేందుకు పోరాడుతాం’’ అని చైనా   ప్రీమియర్‌ వెల్లడించారు.

అసలెక్కడ మొదలయ్యిందంటే: 

అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్‌ దేశం చైనా మధ్య టారిఫ్‌ వార్‌ మరింత ముదిరింది. అమెరికా ఇటీవల ప్రతీకార సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సుంకాలపై చైనా ఘాటుగానే బదులిచ్చింది. డ్రాగన్‌ దేశం సైతం ప్రతీకార సుంకాలను ప్రకటించింది. అయితే, సుంకాలను వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే మరింత సుంకాలను ప్రకటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. చైనా వెనక్కి తగ్గకపోవడంతో ట్రంప్‌ అన్నంత పని చేశారు. చైనా వస్తువులపై భారీగా సుంకాలను ప్రకటించారు. తాజా సుంకాలతో 104శాతానికి సుంకాలు చేరాయి. కొత్తగా ప్రకటించిన సుంకాలు రాత్రి (అమెరికా స్థానిక కాలమానం) 12.01గంటల నుంచి అమలులోకి వస్తాయని వైట్‌హౌస్‌ వెల్లడించింది.

ఏప్రిల్‌ 2న అమెరికా చైనాపై 34శాతం సుంకాలను విధించింది. దీనికి స్పందనగా డ్రాగన్‌ దేశం సైతం అగ్రరాజ్యంపై 34శాతం సుంకాలు విధించింది. చైనా కొత్తగా ప్రకటించిన 34శాతం సుంకాలను ఉపసంహరించుకోకపోతే 50శాతం అదనంగా సుంకాలను ప్రకటిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. ఏప్రిల్‌ 9 నుంచి అమలులోకి వస్తాయని.. దాంతో పాటు చైనాతో అన్ని చర్చలు సైతం రద్దు చేస్తామని స్పష్టంచేశారు. దీనికి అమెరికా ప్రతీకార సుంకాలు ఏకపక్షమని.. రెచ్చగొట్టడమేనంటూ చైనా స్పందించింది. తాము సైతం ప్రతీకార సుంకాలను ప్రకటించామని.. భవిష్యత్‌లోనూ మరిన్ని సుంకాలు పెంచుతామని ఘాటుగా బదులిచ్చింది.

Tags:    

Similar News