Iran: 'పాము తల నరికేశాం': ఇరాన్ గార్డుల ప్రధాన కార్యాలయాన్ని కూల్చేసిన అమెరికా
ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా సంయుక్త దాడులు కొనసాగింపు
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకున్నాయి. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించింది. ‘పాము తల నరికేశాం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ దాడితో ఇకపై ఐఆర్‌జీసీకి ప్రధాన కార్యాలయం అంటూ ఏదీ లేదని స్పష్టం చేసింది.
ఆదివారం సెంట్‌కామ్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. "గత 47 ఏళ్లలో ఐఆర్‌జీసీ 1,000 మందికి పైగా అమెరికన్ల మృతికి కారణమైంది. నిన్నటి భారీ దాడితో ఆ పాము తల నరికేశాం. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యం అమెరికా సొంతం" అని సెంట్‌కామ్ పేర్కొంది.
ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో ఇరాన్‌పై శనివారం నుంచి సంయుక్త సైనిక చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు సీనియర్ సైనిక కమాండర్లు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో ఇప్పటివరకు తమ సైనికుల్లో ముగ్గురు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సెంట్‌కామ్ అధికారికంగా ధ్రువీకరించింది. ఇరు పక్షాలు దాడులను కొనసాగిస్తామని ప్రకటించడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి.