TG: తెలుగువారు బయటకు రావొద్దు: సీఎం రేవంత్
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రేవంత్ కీలక సూచనలు
ఇరాన్-గల్ఫ్ ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్త సూచనలు జారీ చేసింది. భీకర యుద్ధం జరుగుతున్న వేళ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. వారి ప్రాణ భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని, ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అధికారిక మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. ఇరాన్‌తో పాటు పలు గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా అనుసరించాలని సీఎం స్పష్టం చేశారు. స్థానిక ప్రభుత్వాలు, భారత మిషన్లు అందించే భద్రతా మార్గదర్శకాలు ప్రజల రక్షణ కోసమేనని, వాటిని నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే తప్ప బయటకు రావొద్దని, అవసరంలేని ప్రయాణాలు మానుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
విదేశాల్లో ఉన్న తెలుగువారి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే వారిని స్వదేశానికి రప్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే సంబంధిత అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
యూఎస్ కాన్సులేట్ వద్ద భారీ భద్రత
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు అప్రమత్తమయ్యారు. నానక్‌రామ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్ వద్ద సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో నగరంలో నిరసన ర్యాలీలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా కాన్సులేట్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుమారు 50 మంది పోలీసులతో కాన్సులేట్ వద్ద ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. కాన్సులేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేసి, బారికేడ్లను ఏర్పాటు చేశారు. అటువైపుగా వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.