US Travel Ban: 30కి పైగా దేశాలపై ట్రావెల్ బ్యాన్!

అమెరికా ప్రయాణ ఆంక్షల విస్తరణకు రంగం సిద్ధం

Update: 2025-12-05 04:15 GMT

అమెరికా తన ప్రయాణ ఆంక్షల పరిధిని భారీగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం 19 దేశాలపై ఉన్న ఈ నిషేధాన్ని 30కి పైగా దేశాలకు పెంచాలని యోచిస్తున్నట్లు యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ వెల్లడించారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఫాక్స్ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నిషేధిత దేశాల సంఖ్యపై కచ్చితమైన అంకె చెప్పనప్పటికీ, ఆ సంఖ్య 30కి పైగానే ఉంటుందని తెలిపారు. "కొన్ని దేశాల ప్రభుత్వాలు తమ పౌరుల గుర్తింపును ధ్రువీకరించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అలాంటి దేశాల నుంచి వచ్చేవారిని తనిఖీ చేయడం కష్టం. కాబట్టి వారిని మా దేశంలోకి ఎందుకు అనుమతించాలి?" అని ఆమె ప్రశ్నించారు.

ఇటీవల వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులను కాల్చి చంపిన ఘటనే ఈ నిర్ణయానికి తక్షణ కారణంగా తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది 2021లో పునరావాస పథకం కింద అమెరికాలోకి ప్రవేశించిన ఆఫ్ఘన్ జాతీయుడని అధికారులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత వలసదారుల తనిఖీ ప్రక్రియపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

జనవరిలో ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలను కఠినతరం చేస్తున్నారు. సరిహద్దుల్లో నియంత్రణను పెంచడంతో పాటు, దేశ బహిష్కరణ కార్యకలాపాలను వేగవంతం చేశారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, లిబియా, యెమెన్, వెనిజులా సహా 19 దేశాల పౌరులపై ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ జాబితాను ఇప్పుడు మరింత విస్తరించనున్నారు. ఈ కొత్త నిర్ణయంతో అమెరికా ప్రవేశ విధానాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనుండగా, ఇది ప్రపంచవ్యాప్త ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Tags:    

Similar News