TRUMP: ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ
జీన్ కరోల్‌పై పరువు నష్టం కేసును కొట్టేసిన ఫెడరల్ కోర్టు;
తనపై అత్యాచారం చేశారని పదే పదే ఆరోపిస్తూ కోర్టుకెక్కిన కాలమిస్టుపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు నష్టం దావా కేసును కోర్టు కొట్టేసింది. అమెరికా మ్యాగజైన్ కాలమిస్ట్( magazine columnist) జీన్ కరోల్( Jean Carroll) రేప్ జరిగిందని ఆరోపిస్తూ తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ ఆమెపై పరువు నష్టం దావా(awsuit by Donald Trump ) వేశారు.దీనికి నష్ట పరిహారంతోపాటు ఆమెకు శిక్ష వేయాలని, కరోల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు పరువు నష్టం కేసులో పేర్కొన్నారు. ఈ పరువు నష్టం దావాను న్యూయార్క్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. కరోల్‌ను డోనాల్డ్ ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడింది వాస్తవమేనని అందుకే ఈ పరువు నష్టం కేసును కొట్టేస్తున్నట్లు జిల్లా కోర్టు న్యాయమూర్తి(federal judge ) లూయిస్ కప్లాన్( District Judge Lewis Kaplan) తెలిపారు.
1996లో తనపై ట్రంప్ అత్యాచారం చేశారంటూ కాలమిస్టు కోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు రేప్ జరగలేదని నిర్ధారించింది. అయితే ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడినందున 5 మిలియన్ డాలర్లను పరిహారంగా చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది. దీనిపై ట్రంప్ పలు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తనకు న్యాయం చేయాలని, 10 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని, ట్రంప్ వ్యాఖ్యలకు మరింత నష్ట పరిహారం ఇవ్వాలని కాలమిస్టు మళ్లీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ దాఖలైన రెండు వారాలకు ట్రంప్ రివర్స్ పరువు నష్టం దావా వేశారు. జీన్ కరోల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తాను లైంగిక వేధింపుల తోపాటు అత్యాచారం కూడా జరిపినట్లు ప్రతి సందర్భంలోనూ మీడియాతో చెబుతుండడంతో డోనాల్డ్ ట్రంప్ ఆమెపై పరువునష్టం దావా వేశారు.
ట్రంప్‌ను కేసులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా అధికారాన్ని పట్టుకు వేలాడటానికి క్రిమినల్ కుట్ర పన్నారంటూ తనపై దాఖలైన అభియోగాలు నమోదయ్యాయి. అమెరికాను మోసగించడానికి కుట్ర పన్నడం, అధికార కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి కుట్ర పన్నడం, అధికార కార్యక్రమాన్ని అడ్డగించడానికి ప్రయత్నించడం, హక్కుల ఉల్లంఘన కుట్ర అనే నాలుగు రకాల అభియోగాలు నమోదు అయ్యాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ సమాధానమిచ్చారు.
తనను వెంటాడి వేధిస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, సాక్షులు, కోర్టుపరంగా సంబంధమున్న ఎవరినీ వదలబోనని కూడా ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. న్యాయశాఖ ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్, మరి ఇద్దరు అటార్నీలపై బెదిరింపులతో కూడిన ప్రకటనను టీవీలో ప్రసారం చేయడానికి సన్నద్ధమయ్యారు. తన మీద మరో కేసు నమోదైతే చాలు.. వచ్చే ఎన్నికలో గెలిచేది తానేనని ప్రకటించారు. వాళ్లు తన మీద కేసు పెట్టిన ప్రతిసారీ ప్రజాభిప్రాయ సేకరణలో తనకే మద్దతు పెరిగిపోతోందని చెప్పారు.