US President Trump : ఐటీ రద్దుపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన నిర్ణయం!
ఆదాయపన్ను రద్దు చేస్తూ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అందువల్ల ప్రజలు తమ సంపదను మార్కెట్లలోకి స్వేచ్ఛగా తీసుకొస్తారని, పెట్టు బడులు పెడతారని, లావాదేవీలు నిర్వహిస్తారని అన్నారు. తద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, శక్తిమంతమవుతుందని అభిప్రాయ పడ్డారు. అందుకు అనుగుణంగా మన ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, కొత్త విధానాలను రూపొందించాలని సూచించారు. ఫ్లోరిడాలో నిర్వహించిన రిపబ్లికన్ ఇస్యూస్ కాన్ఫరెన్స్ -2025లో ట్రంప్ మాట్లాడుతూ ఆదాయపన్ను రద్దు అంశాన్ని సూచనప్రాయంగా ప్రస్తావించారు. మనపౌరులకు పన్ను పోటు తప్పించి.. టారిఫ్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్న దేశాలపై అత్యధిక సుంకాలు విధించడం ద్వారా ఆదాయాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. మనం టారిఫ్లు చెల్లించి విదేశాలను ఆర్థికశక్తులుగా చేసే బదులు, మన పౌరులకు పన్నులు రద్దు చేసి శక్తివంతులను చేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. మూడు రోజులపాటు జరిగే ప్లానింగ్ సెషన్లో ట్రంప్ ఈ ప్రతిపాదనను చేసే అవకాశం ఉంది. 1913కు ముందు అమెరికాలో ఇన్ కమ్ టాక్స్ అనేది లేదని, అప్పుడంతా టారిఫ్ తోనే ఆదాయం సమకూరే దని, అప్పుడు దేశానికి స్వర్ణయుగమని ట్రంప్ గుర్తు చేశారు.