Trump-Zelensky: వైట్‌హౌస్‌లో ట్రంప్-జెలెన్‌స్కీ నవ్వులు.. .
ఓవల్ ఆఫీసులో నవ్వులే.. నవ్వులు;
వైట్‌హౌస్ వేదికగా ట్రంప్-జెలెన్‌స్కీ సమావేశం ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగినట్లు వాతావరణం కనిపిస్తోంది. గత ఫిబ్రవరిలో ట్రంప్-జెలెన్‌స్కీ మధ్య జరిగిన సమావేశం చాలా హాట్‌హాట్‌గా సాగింది. ఇరుపక్షాలు వాగ్యుద్ధం చేసుకున్నారు. ఇక మధ్యలోనే జెలెన్‌స్కీ వైట్‌హౌస్ నుంచి నిష్క్రమించారు. అప్పట్లో ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది.
అయితే తాజాగా సోమవారం మరొకసారి ట్రంప్-జెలెన్‌స్కీ సమావేశం అయ్యారు. గత మాదిరిగానే మళ్లీ వాడీవేడిగా సమావేశం జరగొచ్చని అంతా భావించారు. కానీ గత సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని యూరోపియన్ నేతలు, నాటో అధికారులు జెలెన్‌స్కీ వెంట వచ్చారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జెలెన్‌స్కీతో పాటు యూరోపియన్ నేతలు కూడా చర్చలు జరిపారు.
ఇక ఓవల్ ఆఫీసులో జెలెన్‌స్కీతో కలిసి ట్రంప్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక విలేకరి మాట్లాడుతూ.. ఈసారి అద్భుతంగా కనిపిస్తున్నారంటూ జెలెన్‌స్కీ దుస్తులను ఉద్దేశించి ప్రశంసించారు. ఈ సూట్‌లో అద్భుతంగా ఉన్నారంటూ కన్జర్వేటివ్ రిపోర్టర్ బ్రియాన్ గ్లెన్ ప్రశంసించారు. గత ఫిబ్రవరిలో ఇదే రిపోర్టర్ విమర్శించారు. తాజాగా అదే రిపోర్టర్ ప్రశంసించడంతో ఒక్కసారిగా నవ్వులు విరిచాయి. కాసేపు జెలెన్‌స్కీ-ట్రంప్-విలేకర్లు, అధికారులంతా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక జెలెన్‌స్కీ-విలేకరి గ్లెన్ సంభాషణలో ట్రంప్ కూడా జోక్యం చేసుకుని తాను కూడా అదే విషయాన్ని చెప్పానని వ్యాఖ్యానించారు. గతసారి మీపై దాడి చేసింది ఇతనే అని ట్రంప్ అనగానే ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. వెంటనే జెలెన్‌స్కీ కలుగజేసుకుని ఆ విషయం తనకు గుర్తుందని ట్రంప్‌కు బదులిచ్చారు.
ఫిబ్రవరిలో ఓవల్ ఆఫీసులో జరిగిన సమావేశంలో అమెరికా విలేకరి గ్లెన్.. జెలెన్‌స్కీని ప్రశ్నిస్తూ.. మీరు సూట్ ఎందుకు ధరించలేదు. మీరు ఈ దేశంలో అత్యున్నత కార్యాలయంలో ఉన్నారని.. ఎందుుకు సూట్ ధరించలేదని ప్రశ్నించారు. ఎందుకు మీరు ఈ కార్యాలయాన్ని గౌరవించడం లేదని నిలదీశాడు. దీనికి జెలెన్‌స్కీ బదులిస్తూ.. ఉక్రెయిన్‌లో శాంతి సాధించే వరకు సైనిక దుస్తులనే ధరించాలని నిర్ణయించుకున్నట్లు జెలెన్‌స్కీ సమాధానం ఇచ్చారు. అయితే తాజాగా ట్రంప్ జోక్యంతో ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందానికి బాటలు పడడంతో గత మాదిరిగా కాకుండా ఈసారి భిన్నంగా జెలెన్‌స్కీ వస్త్రాలు ధరించి వచ్చారు.