US Indian Couples: దంపతులకు గ్రీన్ కార్డు రూల్స్ మరింత కఠినం..
ట్రంప్ సర్కారు నిర్ణయం;
గ్రీన్‌కార్డు నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేసింది. కుటుంబం, మరీ ముఖ్యంగా వివాహం ఆధారంగా దాఖలయ్యే వలసదారుల దరఖాస్తులను మరింత కట్టుదిట్టంగా పరిశీలించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధానాలను యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) విడుదల చేసింది. చట్టబద్ధ శాశ్వత నివాసం (గ్రీన్ కార్డు) కోసం గతంలో సమర్పించిన, కొత్తగా సమర్పించే దరఖాస్తులకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
ఏమిటి ఈ నిబంధనలు?
దంపతులు తమ మధ్య వైవాహిక బంధం నిజమైనదేనని నిరూపించుకునేందుకు ఉమ్మడి ఆర్థిక రికార్డులను సమర్పించాలి. బ్యాంకు ఖాతాలు, యుటిలిటీ బిల్స్‌లో వారి పేర్లు ఉండాలి. దంపతులిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను సమర్పించాలి. బంధుమిత్రుల నుంచి వచ్చే వ్యక్తిగత వ్యాఖ్యలు లేదా లేఖలను అందజేయాలి. సేమ్ స్పాన్సర్ లేదా అప్లికెంట్ గతంలో ఇలాంటి దరఖాస్తులు చేశారేమో కూడా యూఎస్‌సీఐఎస్ పరిశీలించవచ్చు. దంపతుల వివాహం చెల్లుబాటును మదింపు చేయడం కోసం వారిద్దరికీ తరచూ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.