Tesla :టెస్లా కొత్త సీఎఫ్ఓ మనోడే
టెస్లాలో కీలక పదవికి భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా;
అంతర్జాతీయ వేదికపై మరో భారత సంతతి వ్యక్తి సత్తా చాటాడు. ఢిల్లీ నుంచి దిగ్గజ స్థాయికి ఎదిగి ఔరా అనిపించాడు. సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల.. సరసన చేరి భారత కీర్తి పతాకను రెపరెపలాడించాడు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) నూతన చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్(CFO)గా భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజా (Vaibhav Taneja) నియమితులయ్యారు. కంపెనీ CFOగా నాలుగేళ్ల పాటు కొనసాగిన జాచరీ కిర్కోర్న్ ఆ పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అకౌంటింగ్ హెడ్‌గా ఉన్న వైభవ్ తనేజా బాధ్యతలు స్వీకరించనున్నారు. జాచరీ ఉన్నఫళంగా నిష్క్రమించడానికి గల కారణాలను టెస్లా వెల్లడించలేదు. ఈ కంపెనీతో ఆయనకు 13 ఏళ్ల అనుబంధం ఉంది.
జాచరీ అకస్మాత్తుగా రాజీనామా చేయడానికి గల కారణాలను టెస్లా బయటపెట్టలేదు. రాజీనామా వార్త బయటకు రావడంతో ఆ సంస్థ షేర్లు సోమవారం మూడు శాతం నష్టపోయాయి.టెస్లాలో భాగస్వామిని కావడం తనకు ఒక ప్రత్యేక అనుభవం అని జాచరి కిర్కోర్న్ పేర్కొన్నారు. తాను కంపెనీలో చేరినప్పటి నుంచి అందరితో కలిసి పని చేసినందుకు చాలా గర్వంగా ఉందని తన లింక్డ్ ఇన్ ఖాతాలో రాసుకున్నారు. 2019లో టెస్లా సీఎఫ్ఓగా జాచరి కిర్కోర్న్‌ను సంస్థ సీఈఓ ఎలన్‌మస్క్ ప్రకటించారు.
వైభవ్ తనేజా ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో పట్టభద్రుడయ్యారు. వైభవ్‌కు అకౌంటింగ్‌లో 20 ఏళ్ల అనుభవం ఉంది. టెస్లా చేరడానికి ముందు టెక్నాలజీ, ఫైనాన్స్, రిటైల్, టెలికం రంగ కంపెనీల్లో పని చేశారు. 2016లో సోలార్ సిటీ అనే కంపెనీని టెస్లా కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థలో వైభవ్ తనేజా భాగస్వామి అయ్యారు. రెండేండ్ల క్రితం 2021లో టెస్లా ఇండియా డైరెక్టర్‌గా వైభవ్ తనేజా నియమితులయ్యారు.
45 ఏళ్ల వైభవ్ తనేజాకు టెస్లా మాజీ సీఎఫ్‌ఓలు దీపక్ అహుజా, జాచరీ కిర్కాన్‌లతో తనేజాకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గతంలో వీరితో టెస్లా త్రైమాసిక ఫలితాలు, యూఎస్ అండ్ ఇంటర్నేషనల్ కంట్రోలర్‌షిప్ సమయాల్లో కలిసి పనిచేశారు. తనేజా ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌లో పనిచేశారు. అందులో 1996లో చేరారు. భారత కార్యాలయం నుంచి అమెరికాకు మకాం మార్చారు. దాదాపు సంస్థలో 17 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు.
టెస్లా త్వరలోనే త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో.. వివిధ వ్యాపారవేత్తలతో సమావేశాల్లో భాగంగా టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌ను కూడా కలిశారు. అప్పుడే మస్క్ టెస్లా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారత్‌లో టెస్లా యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.