AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెక్టర్ల బదిలీలు

AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెక్టర్ల బదిలీలు
X
13 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం... వైసీపీతో అంటకాగిన వారికి నో పోస్టింగ్స్‌

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెక్టర్లను బదిలీలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 26 జిల్లాలకు గానూ 13 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. జీఏడీకి రిపోర్టు చేయాలని ఏడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. వైసీపీతో అంటకాగిన విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మల్లికార్జున, మాధవీలత, వేణుగోపాలరెడ్డిలకు పోస్టింగులు ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. విశాఖ కలెక్టర్ మల్లికార్జు్న్ జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విశాఖ కలెక్టర్‌గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. అల్లూరి జిల్లా కలెక్టర్‌గా ఏఎస్ దినేష్‌కుమార్‌ను నియమించగా.. ప్రస్తుత అల్లూరి జిల్లా కలెక్టర్‌ విజయ్ సునీతాను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. కాకినాడ కలెక్టర్‌గా షన్‌మోహన్‌ నియమితులయ్యారు. జీఏడీకి రిపోర్టు చేయాలని జే. నివాస్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏలూరు కలెక్టర్‌గా వెట్రి సెల్వీ నియమితులు కాగా.. జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రసన్న వెంకటేశ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి, జీఏడీకి మాధవిలత.. విజయనగరం కలెక్టర్‌గా బీఆర్‌ అంబేద్కర్‌ను నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నాగరాణి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమీత్‌కుమార్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా సుజన నియమితులయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లా ప్రస్తుత కలెక్టర్‌ ఢిల్లీ రావును జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ హన్సారియా నియామకమయ్యారు. కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా రంజిత్ భాష, బాపట్ల జేసీకి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అంటకాగిన షగిలి షన్మోహన్‌కు పదోన్నతి కల్పించారా అన్నట్టు.. కాకినాడ జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇవ్వటం విస్మయానికి గురిచేసింది. వైసీపీ అరాచకాల పట్ల చూసీచూడనట్లు వ్యవహరించిన, అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి చెప్పిన వాటికల్లా తలాడించారనే ఫిర్యాదులున్న బాపట్ల కలెక్టర్‌ రంజిత్‌బాషాకు కర్నూలులాంటి కీలక జిల్లాకు కలెక్టర్‌గా పంపించటమూ షాక్‌కు గురిచేసింది. ఎన్నికల సమయంలో వైకాపా అభ్యర్థుల అరాచకాలు, అక్రమాలను చూసీచూడనట్లు వదిలేసి, వాటిని అడ్డుకున్న యర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను ఇబ్బంది పెట్టారన్న ఫిర్యాదులున్న ప్రకాశం కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగు ఇవ్వటం ఎలాంటి సంకేతాలనిస్తుందన్న చర్చ అధికార వర్గాల్లో నడుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్లుగా అవకాశం ఇవ్వని నాగరాణి, అంబేద్కర్‌లకు కలెక్టర్‌లుగా ప్రభుత్వం పోస్టింగులిచ్చింది. పశ్చిమగోదావరి కలెక్టర్‌గా పనిచేసినప్పుడు వైకాపా నాయకులు చెప్పినట్లు వినలేదన్న కారణంతో అప్పట్లో బదిలీ అయిన ప్రశాంతిని తూర్పుగోదావరి కలెక్టర్‌గా నియమించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లుగా మహిళలను నియమించటం, ఈ జిల్లాలన్నీ భౌగోళికంగా వరుసగా ఉండటం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శనివారం ఉత్తర్వులిచ్చారు.

Tags

Next Story