YCP MLA Tickets : 51 శాతం వైసీపీ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు కట్‌?

YCP MLA Tickets : 51 శాతం వైసీపీ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు కట్‌?
YCP MLA Tickets : వైసీపీ బాక్సులు బద్దలయ్యే వార్త ఒకటి బయటికొచ్చింది.. ఎమ్మెల్యేల ఊహకు కూడా అందని సర్వే ఒకటి రహస్యంగా జరిగిపోయిందట..

YCP MLA Tickets : వైసీపీ బాక్సులు బద్దలయ్యే వార్త ఒకటి బయటికొచ్చింది.. ఎమ్మెల్యేల ఊహకు కూడా అందని సర్వే ఒకటి రహస్యంగా జరిగిపోయిందట.. ఎమ్మెల్యే పనితీరు ఏస్థాయిలో ఉందో ప్రభుత్వానికి రిపోర్ట్‌ అందినట్లు సమాచారం.. వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు.. ఓడేదెవరో ఆ రిపోర్ట్‌లో స్పష్టంగా ఉందట.. ఆ రిపోర్ట్‌ ద్వారా వైసీపీ అధినేత జగన్‌ ముందు జాగ్రత్త పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది..

ఒకళ్లిద్దరు కాదు.. ఏకంగా సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో టికెట్లు కట్‌ అన్నట్లుగా తెలుస్తోంది.. ప్రభుత్వానికి అందిన తాజా నివేదికల ప్రకారం సగం మందిపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తేలిందట.. దీంతో వారందరికీ ఈసారి టికెట్లు ఇచ్చే ప్రసక్త లేదని జగన్‌ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది.. 51 శాతం మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్లు దక్కవని అధినేత జగన్‌ పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఒక్క ఛాన్స్‌ అన్న జగన్‌ పిలుపుతో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించారు ఏపీ ప్రజలు.. అయితే, ఈ మూడేళ్లలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రెచ్చిపోతున్న మాఫియాలను చూసి విసిగిపోయిన ప్రజలు ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు సమాచారం.. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎన్నికల్లో సగం మందికి టికెట్లు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.. ఇటీవలే వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించిన జగన్‌.. ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్‌ పీకారు.. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతిరోజూ నివేదిక తెప్పించుకుని సమీక్షిస్తానని వైసీపీఎల్పీ సమావేశంలోనే జగన్‌ స్పష్టం చేశారు.

ఇక నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.. గత రెండున్నరేళ్లుగా ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వే చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నానని వారికి చెప్పారు.. కొంతమంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. సర్వేలు చేయించి అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటేనే ఈసారి టికెట్లు ఇస్తానని కుండబద్దలు కొట్టారు. అన్నట్లుగానే నియోజకవర్గాల వారీగా రహస్యంగా సర్వే చేయించి వ్యతిరేకత ఉన్న వారిని ఈసారి పక్కన పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.. రాయలసీమ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిం చిన నిధులు లేకపోవడంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలూ జరగలేదని.. అయితే, అభివృద్ధి జరగకపోగా, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నట్లుగా కొంతమందిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.. జాతీయ రహదారులకు సంబంధించిన కాంట్రాక్టర్లను కూడా బెదిరించినట్లుగా ఆరోపణలున్నాయి.. ఈ నేపథ్యంలోనే అక్కడి ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు నివేదికలో తేలిందట..

ఇక కోస్తా జిల్లాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత వున్నట్లు ప్రభుత్వానికి అందిన రిపోర్టులో తేలిందట.. కోస్తా జిల్లాల్లో ప్రధానంగా ఇసుక మాఫియా చెలరేగిపోతుండటం, ఒక సంస్థకు కాంట్రాక్టు ఇచ్చినప్పటికీ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలంతా పెద్ద ఎత్తున ఇసుక దందా చేస్తున్నారనే సమాచారం సర్వే ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.. ఇక ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలో గ్రావెల్‌, మట్టి మాఫియాల ఇష్టారాజ్యం నడుస్తోందన్నది సర్వే రిపోర్ట్‌ సారాంశమట.. అలాగే ఈ మూడు జిల్లాల్లో మరో ముఖ్యమైన అంశంలోనూ అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. ఇళ్ల స్థలాల పేరుతో రైతుల వద్ద భూములు సేకరించి వాటి ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు కొల్లగొట్టారన్న ఆరోపణలు బలంగా వచ్చాయి.. ఈ ఇళ్ల స్థలాల వ్యవహారం కూడా వైసీపీకి అప్రతిష్ట తీసుకొచ్చిందని సర్వే రిపోర్ట్‌ ద్వారా తెలుస్తోంది.

ఇక ఉత్తరాంధ్రలోనూ వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు ముఖ్యమంత్రి చేయించిన సర్వేలో తేలిందట.. విశాఖపట్నంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ల్యాండ్‌ మాఫియా, మైనింగ్‌ మాఫియా చెలరేగిపోతోందని సర్వే రిపోర్టులో బట్టబయలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక విశాఖ, పరిసర ప్రాంతాల్లో ల్యాండ్‌ మాఫియా చేసిన అరాచకాలతో తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.. భవిష్యత్‌ కలల రాజధాని అని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వ్యతిరేకత మూటగట్టుకోవాల్సిన పరిస్థితి..

Tags

Read MoreRead Less
Next Story