AP: ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే రికార్డు స్థాయి ఓటింగ్

AP: ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే రికార్డు స్థాయి ఓటింగ్
ఓటు హక్కు వినియోగించుకున్న 81.86 శాతం మంది... నాలుగు దశల ఎన్నికల్లో దేశంలోనే అత్యధికం

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా 81.86 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు దశల పోలింగ్‌లో ఏపీలో నమోదైన ఓటింగే అత్యధికమని రాష్ట్రఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు జరిగినా ఎక్కడా రీపోలింగ్ అవసరం రాలేదన్నారు. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. మొత్తం...... 4కోట్ల 13లక్షల 33వేల 702మంది ఓటర్లకు గానూ.... 3 కోట్ల 33 లక్షల 40వేల 560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికల విధుల్లో ఉన్న 4లక్షల 44వేల ఓట్లతో పాటు...హోమ్‌ ఓటింగ్‌ వేసిన వారిని కలిపితే మొత్తం 4 లక్షల 97వేల ఓట్లు పోలయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. ఈవీఎంల ద్వారా నమోదైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఓటింగ్ శాతం 1.2శాతం కలిపితే మొత్తం 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు వివరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 1.9 శాతం ఎక్కువని స్పష్టం చేశారు. 1.64 కోట్ల మంది పురుష ఓటర్లు, 1.69 కోట్ల మంది మహిళా ఓటర్లు ఓటు వేసినట్టు వివరించారు. సాయంత్రం 4 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారని చెప్పారు. కోనసీమ, శ్రీకాకుళం, మచిలీపట్నం, సత్యసాయి జిల్లాల్లో మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగిందన్నారు. EVMలను పగులగొట్టిన చోట కూడా...... వెంటనే పోలింగ్ కొనసాగించినట్టు చెప్పారు. ఎన్నికల అబ్జర్వర్లు ఎక్కడా రీపోలింగ్‌కు సిఫార్సులు చేయలేదని మీనా వివరించారు.


అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి...... అత్యధికంగా దర్శిలో 90.91 శాతం మేర పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా తిరుపతిలో.... 62.72 శాతం మేర నమోదైనట్టు సీఈఓ వెల్లడించారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఒంగోలులో అత్యధికంగా 87.06 శాతం... అత్యల్పంగా విశాఖలో 71.11 శాతం నమోదైనట్టు తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత EVMలను... 33 చోట్ల స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచామని సీఈఓ తెలిపారు. వీటికి మూడంచెల భద్రత కల్పించినట్టు చెప్పారు.

పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఉక్కుపాదం మోపుతున్నట్టు సీఈఓ స్పష్టం చేశారు. పోలింగ్‌ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేటల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామన్నారు. అల్లర్లకు కారణమైన వారందరినీ జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే చంద్రగిరిలో 30 మందిని అరెస్టు చేసినట్టు CEO వెల్లడించారు. పోలింగ్ రోజున నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైనా త్వరలోనే చర్యలుంటాయన్నారు.

Tags

Next Story