Anantapur: అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి.. పెళ్లికి వెళ్లొస్తుండగా..

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లిబృందం సభ్యులతో వెళుతున్న ఇన్నోవా కారును లారీ ఢీకొనడంతో 9 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఉరవకొండ మండలం బూదగవి వద్ద ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో జరిగే వివాహానికి హాజరై తిరిగి అనంతపురం వెళుతుండగా.. ఘోరం సంభవించింది. మృతులంతా ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇన్నోవా కారు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతులంతా ఒకే కుటుంబానికిచెందిన వారుగా గుర్తించారు.
ప్రమాదంలో ఇన్నోవా కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుంబంలో తొమ్మిది మంది మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతుల్లో బీజేపీ నేత వెంకటప్ప నాయుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇన్నోవా కారు డ్రైవర్ నిద్రమత్తులో.. అతివేగంగా వాహనాన్ని నడపటంతోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com