AP: జగన్ ను విచారించనున్న ఏపీ ప్రభుత్వం..!

ఆంధ్రప్రదేశ్ లో సౌర విద్యుత్ ప్రాజెక్టు లంచం కేసు ప్రకంపనలు రేపుతోంది. వైసీపీ అధినేత జగన్ చుట్టూనే తిరుగుతోంది. ఈ కేసులో జగన్ మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్‌ను ప్రాసిక్యూట్ చేసే అవకాశాలను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. వైసీపీ చీఫ్ జగన్.. ఆదానీ గ్రూపు నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సీఎం చంద్రబాబు స్పందించారు. జగన్ రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపారని మండిపడ్డారు. ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తి లేదన్నారు. ఏ చర్యలు తీసుకోవచ్చన్న దానిపై నిపుణుల సలహా తీసుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. అయితే చంద్రబాబు ప్రకటనతో ఈ కేసులో జగన్ పై చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుందనే ప్రచారం జరుగుతోంది.
ఛార్జీషీటులో ఏముందంటే..?
2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి రూ.1750 కోట్ల లంచం ఇచ్చారని చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని చార్జిషీటులో నిర్దిష్టంగా ప్రస్తావించారు. దీని ఆధారంగా జగన్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయవచ్చా అన్న కోణంలో కూటమి ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. న్యాయ నిపుణుల సలహా ఇందుకు సానుకూలంగా వస్తే జగన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతిని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ అధికరణం ప్రకారం మాజీ సీఎంను అరెస్టు చేసి విచారణ జరపడానికి గవర్నర్ అనుమతి అవసరం.
టీడీపీ ఆగ్రహం
జగన్ ప్రభుత్వం సెకీ ద్వారా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొన్నప్పుడే టీడీపీ దీనిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ పార్టీ తరఫున నాటి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ బహిరంగంగా తన వాణిని వినిపించారు. జగన్ కుదుర్చుకొన్న ఒప్పందం రాష్ట్రానికి మోయరాని భారంగా మారుతోందని, తన జేబులు నింపుకోవడానికి ఆయ న ప్రజల జేబులు ఖాళీ చేయిస్తున్నారని కేశవ్ అప్పట్లో ఆరోపించారు. ఆయన అంతటితో వదిలి పెట్టకుండా ఈ ఒప్పందంపై కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలికి కూడా ఫిర్యాదు చేశారు. మామూలుగా కేంద్ర మండలి రాష్ట్రాల నుంచి రాజకీయ నేతల ఫిర్యాదులను తీసుకోదు. కానీ కేశవ్ పదేపదే అభ్యర్థించడంతో ఆయన ఫిర్యాదును స్వీకరించడానికి అంగీకరించింది. దీంతో ఈ ఒప్పందంపై సవివరంగా తమ అభ్యంతరాలతో ఫిర్యాదు దాఖలు చేశారు. కానీ తర్వాత కేంద్ర నియంత్రణ మండలి ఆ ఫిర్యాదును తిరస్కరించింది. దీంతో కేశవ్ ఈ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఇదే అంశంపై హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఇవి ఇంతవరకూ విచారణకు రాలేదు. ఈ ఒప్పందంపై కేశవ్ విమర్శల తర్వా త నాడు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఒప్పందంలో కుదుర్చుకున్నట్లుగా ఒక యూనిట్ విద్యుత్ రూ.2.49కి రాదని, రాజస్థాన్‌లో తయారైన సౌర విద్యుత్ ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి చేరేసరికి ఒక్కోయూనిట్‌కు అదనంగా రూ.1.70 పడుతుం దని ఆయన అంగీకరించారు. సౌర విద్యుత్‌ను దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఒకయూనిట్‌ను రూ.2కు కొనుగోలు చేస్తున్న సమయంలో ఇంతధర పెట్టాలా అన్నప్రశ్న అప్పట్లోనే ప్రతిపక్షాలనుంచి వినిపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com