AP : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కన్నుమూత..

AP : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కన్నుమూత..
X

గత నెలలో చౌటుప్పల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆంధ్రప్రదేశ్ అడిషనల్ ఎస్పీ ప్రసాద్, నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఈరోజు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు డీఎస్పీలు మరణించగా, తాజాగా ఏఎస్పీ ప్రసాద్ మరణం పోలీస్ శాఖ లో విషాదాన్ని మిగిల్చింది.

జూలై 26న ఏపీకి చెందిన పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా, వాహనం అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి వాహనం పక్కకు ఎగిరిపడి, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో స్కార్పియో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు డీఎస్పీలు చక్రధరరావు, శాంతరావు మరణించారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో, ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం విషమించి ఈరోజు కన్నుమూశారు. ఆయన మృతితో పోలీసు ఉన్నతాధికారులు మరియు సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Tags

Next Story