AP: మహిళలకు ఉచిత ప్రయాణానికి రంగం సిద్ధం !

AP: మహిళలకు ఉచిత ప్రయాణానికి రంగం సిద్ధం !
ఇప్పటికే అధ్యయన నివేదికను సిద్ధం చేసిన ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు... రేపు కీలక చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రంగం సిద్ధమవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే అధ్యయన నివేదికను సిద్ధం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీఎస్‌ఆర్టీసీకి నెలకు రూ.250 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేశారు. ఇప్పటికే ఈ పథకం అమలుచేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు.. అక్కడ ఏయే బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు, ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ ఎలా. అన్న అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. సీఎం చంద్రబాబు ఆర్టీసీ, రవాణా శాఖలపై రేపు(సోమవారం) నిర్వహించనున్న సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కీలక చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందుగా నివేదికను రూపొందించారు.


ఏపీఎస్‌ఆర్టీసీలో నిత్యం సగటున 36-37 లక్షల మంది ప్రయాణిస్తున్నారని... ఇందులో 40 శాతం మంది అంటే 15 లక్షల వరకు మహిళలు ఉంటున్నారని. వీరికి ఉచిత ప్రయాణం అమలుచేయాల్సి ఉంటుందని ఆర్టీసీ ఆధికారులు నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్ప్రెస్‌ బస్సులు.. హైదరాబాద్‌ నగరంలో తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారని... కర్ణాటకలోనూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో, బెంగళూరులోని సిటీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించే విధానం అమలు చేస్తున్నారని గుర్తించారు. తమిళనాడులో చెన్నై, కోయంబత్తూరు నగరాల్లోని సిటీ సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారని నివేదికలో పేర్కొన్నారు.

ఏపీ పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులతో పాటు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఉచిత సదుపాయం కల్పించేందుకు వీలుందని భావిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకల్లో మహిళలకు జీరో టికెట్‌ జారీ చేస్తున్నారు. ఆ టికెట్‌పై ఛార్జీ సున్నా అనే ఉన్నా.. టికెట్లిచ్చే యంత్రం (టిమ్‌)లో మాత్రం అసలు ఛార్జీ నమోదవుతుంది. ఇలా మహిళలకు జారీచేసిన సున్నా టికెట్ల మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్కించి.. రీయింబర్స్‌ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారని నివేదికలో తెలిపారు. తెలంగాణ, కర్ణాటకల్లో గతంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 65-70 శాతం ఉండగా.. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాక 95 శాతానికి చేరిందని తెలిపారు. ఏపీఎస్‌ఆర్టీసీలో ఓఆర్‌ 69-70 శాతం మధ్య ఉంది. ఉచిత ప్రయాణం అమలైతే అది 95 శాతానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags

Next Story