AMIT SHAH: నేరగాళ్లను తరిమికొట్టేందుకే కూటమి

AMIT SHAH: నేరగాళ్లను తరిమికొట్టేందుకే కూటమి
X
జగన్‌ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చివేస్తామన్న కేంద్ర హోంమంత్రి... చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్న అమిత్‌ షా

ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేరగాళ్లు, మాఫియాను తరిమికొట్టేందుకే బీజేపీ, తెలుగుదేశం, జనసేన జట్టుకట్టాయని.. కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు. రాష్ట్రంలో జగన్‌ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చివేస్తామన్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన కూటమి ప్రచార సభలో.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, అభ్యర్థులు పాల్గొన్నారు. జగన్‌ పాలన వైఫల్యాలను ఎండగట్టిన అమిత్‌ షా... కూటమికి అధికారమిస్తే పోలవరాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. రాజధానిగా అమరావతిని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు.


"ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి, నేరాలు, మాఫియాను అరికట్టడానికి.. భాజపా, జనసేన, తెదేపా కూటమిగా ఏర్పడ్డాయి. ఏపీ నుంచి గూండాగిరిని, నేరగాళ్లను తరిమేందుకు జట్టు కట్టాం. భూ మాఫియాను అంతం చేసేందుకు కలిసి వస్తున్నాం. ఏపీ రాజధాని అమరావతిని తిరిగి నిర్మించేందుకు కూటమిగా కలిశాం. తిరుమల శ్రీవారి పవిత్రతను పునఃప్రతిష్ఠాపించేందుకు ఏకమయ్యాం. తెలుగు భాషను పరిరక్షించేందుకు ఒక్కటయ్యాం. తెలుగు భాషను అంతం చేసి.. ఆ స్థానంలో ప్రాథమిక విద్య నుంచే ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాలన్నది జగన్‌ సర్కారు కోరిక. చెవులు రెక్కించి విను జగన్‌..! భాజపా ఉన్నంత వరకు తెలుగు భాషను అంతం కానివ్వం. ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు.. జగన్‌ సర్కారు అవినీతి వల్ల దాదాపుగా మరుగున పడింది. మోదీ గ్యారంటీగా చెబుతున్నా.. ఏపీలో చంద్రబాబును, కేంద్రంలో మోదీని గెలిపించండి. రెండేళ్లలోనే పోలవరాన్ని పూర్తి చేసి పొలాలకు నీరు అందిస్తాం.” అని అమిత్‌ షా అన్నారు.

చంద్రబాబు పాలనలో ప్రగతి పథంలో పరుగెత్తిన రాష్ట్రాన్ని.. జగన్‌ అధోగతి పాలు చేశారని... అమిత్‌షా దుయ్యబట్టారు. " చంద్రబాబు ముఖ్యమంత్రిగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత స్థానంలో నిలిపారు. విభజన తర్వాత కూడా ఇక్కడ గట్టి పునాదులు వేశారు. జగన్‌ వచ్చాక రాష్ట్రాన్ని ప్రగతి పట్టాల నుంచి తప్పించారు. అభివృద్ధి శూన్యం. పెట్టుబడుల ఊసేలేదు. నిరుద్యోగిత ఆకాశాన్నంటింది. ఏపీపై రూ.13 లక్షల కోట్ల రుణభారం మోపారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిలిచిపోయాయి కానీ.. భూ కబ్జాలు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయి. మద్య నిషేధమని చెప్పి ఏకంగా మద్యం సిండికేట్‌ను నడుపుతున్నారు. జగన్‌ రాయలసీమను విస్మరించారు. మోదీ, చంద్రబాబును గెలిపించండి. పోలవరంతోపాటు.. హంద్రీ-నీవా సుజల స్రవంతి, వెలిగొండ వంటి అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తాం.” అని హామీనిచ్చారు. చీకటి చట్టాలతో ప్రజల ఆస్తుల్ని కొట్టేయాలని జగన్‌ కుట్ర పన్నారని... చంద్రబాబు ఆక్షేపించారు. అరాచక ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు

Tags

Next Story