Police : వైకాపా జెండా దించాలన్న టీడీపీ కార్యకర్త

అనంతపురం జిల్లా పాల్తూరు పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. సభ్య సమాజం తలదించుకునేలా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలిగేలా... తెలుగుదేశం కార్యకర్తను స్టేషన్ ముందు నగ్నంగా నిలబెట్టారు. ఈ నెల రెండో తేదీన జరిగిన ఈ దురాగతం... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అనంతపురం జిల్లా పాల్తూరులో ఈ దారుణం జరిగింది. చట్టాన్ని పక్కాగా ఫాలో కావాల్సిన పోలీసులు ఓ కేసులో స్టేషన్ కు పిలిచిన తెలుగుదేశం కార్యకర్త పట్ల కర్కశంగా ప్రవర్తించారు. ఒళ్లు గుల్లయ్యేలా కిరాతకంగా కొట్టారు. అంతటితో సరిపెట్టకుండా... ఆ తర్వాత మరింత దిగజారి వ్యవహరించారు. ఆ కార్యకర్త బట్టలు ఊడదీయించారు. కనీసం లోదుస్తులైనా లేకుండా స్టేషన్ ముందు నగ్నంగా అటు, ఇటు తిప్పారు. పాల్తూరు పోలీసుల నీచత్వం ఆలస్యంగా బయటికొచ్చింది.
పోలీసుల అరాచకత్వానికి నగ్నంగా నిలబడాల్సిన దుస్థితిని ఎదుర్కొన్న వ్యక్తి... చీకలగురికి గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త చంద్రమోహన్. జనవరి ఒకటో తేదీ రాత్రి వైకాపా జెండాకు నిప్పు పెట్టాడని అధికార పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ నెల రెండో తేదీన పాల్తూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ కోసం స్టేషనుకు పిలిపించిన పోలీసులు... చట్టం, ధర్మం, న్యాయం అనే రాజ్యాంగ పద్ధతులు మరిచిపోయారు. చంద్రమోహన్ ను అతి కిరాతకంగా చితకబాదారు. ఆ తర్వాత నగ్నంగా బయట తిప్పారు. పోలీసు దెబ్బలకు నడవలేని స్థితిలో ఉన్న చంద్రమోహన్ ను కుటుంబ సభ్యులు బళ్లారి ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది.ఈ దారుణాన్ని ఖండించాల్సిన పోలీసు పెద్దలు నిస్సిగ్గుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల పట్ల చంద్రమోహన్ దురుసుగా వ్యవహరించడం వల్లే అరెస్టు చేసినట్లు డీఎస్పీ నరసింగప్ప తెలిపారు. చంద్రమోహన్ ను పోలీసులు కొట్టలేదని చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com