Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను మరోసారి అడ్డుకున్న పోలీసులు..

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను మరోసారి అడ్డుకున్న పోలీసులు..
X
ఏపీలోకి వచ్చేందుకు వీసా, పాస్ పోర్ట్ కావాలేమో ! జనసేన చీఫ్

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రానివ్వకుండా అడ్డుకోవాలని చూసిన ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముచ్చెమటలు పట్టించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు,జనసేన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పవన్‌ శనివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చేందుకు సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో విమానాశ్రయ అధికారులు అనుమతి నిరాకరించ వెనుదిరిగారు. పవన్‌ విజయవాడ వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గన్నవరం విమానాశ్రయం అధికారులకు మెయిల్‌ పంపారు. ఫలితంగా పవన్‌ విమానానికి అనుమతి నిరాకరించారు. తర్వాత రోడ్డు మార్గంలో విజయవాడ పయనమైన పవన్‌ను గరికపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోగా. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ నడిరోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.


ఏపీ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వీసా కావాలని అంటుందేమో అని పవన్‌ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. క్రిమినల్‌ చేతిలో అధికారం ఉంటే ఇలాగే ఉంటుందనే విషయం ప్రజలు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఏ తప్పూ చేయని నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను వైసీపీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి అరెస్టు చేయడం సరికాదని పవన్ హితవుపలికారు. శాంతిభద్రతలను కాపాడాల్సింది పోలీసులే కదా అంటూ ప్రశ్నించిన పవన్... శాంతిభద్రతల విషయంలో వైసీపీకి సంబంధమేంటని విమర్శలు గుప్పించారు. అరాచకాలు జరుగుతున్నది వైసీపీవల్లే కదా? అంటూ ఎద్దేవా చేశారు. ఒక నాయకుడు అరెస్టయితే మద్దతుగా కచ్చితంగా అభిమానులు బయటకొస్తారని... నాయకుడికి మద్దతుగా రావడం ప్రజాస్వామ్యంలో భాగమే కదా అంటూ వెల్లడించారు. ఇళ్లలో నుంచి బయటకెవరూ రాకూడదంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.

పవన్‌కల్యాణ్ కు మద్దతుగా వేలాదిగా జనసేన కార్యకర్తలు తరలిరాగా.. పోలీసులు చివరకు దిగివచ్చారు. మూడు వాహనాలకు అనుమతిచ్చి పోలీసు ఎస్కార్ట్‌తో మంగళగిరి పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ విషయాలు జన సేన ఎక్స్ (ట్విట్టర్) వేదిక ఓ పోస్ట్ చేసింది. ఇందులో జనసేన కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తున్నారు. వీడియోలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... మనకు వీసా, పాస్ పోర్ట్ అవసరమేమో అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరినప్పటికీ మళ్లీ అనుమంచిపల్లి వద్ద మరోసారి పోలీసులు జనసేనాని వాహనాన్ని ఆపేశారు.

Tags

Next Story