AP High Court : రాజధాని విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court : రాజధాని విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
AP High Court : 6 నెలల్లో రాజధాని ప్లాన్‌ పూర్తి చేయాల్సిందేనని, 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు ఇవ్వాలంది.

AP High Court : చరిత్ర ఎరుగని మోసానికి తెరతీస్తూ YCP సర్కారు చేసిన కుట్రలు ఓవైపు.. ఆ నయవంచనను సవాల్‌ చేస్తూ అమరావతి రైతుల కొనసాగించిన అలుపెరగని పోరాటం మరోవైపు.. 807 రోజులుగా కొనసాగుతున్న ఈ సంఘర్షణలో ప్రతిసారీ కోర్టుల్లో ధర్మమే గెలిచింది. న్యాయస్థానాల నిష్పాక్షిక తీర్పులతో రైతులకు ఊరట లభించింది. 3 రాజధానులు, CRDA రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన 64 పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. ఇవాళ చారిత్రక తీర్పు ఇస్తూ కీలకమైన అంశాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.

CRDA మాస్టర్‌ ప్లాన్‌ను ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. 6 నెలల్లో రాజధాని ప్లాన్‌ పూర్తి చేయాల్సిందేనని, 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు ఇవ్వాలంది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. రాజధాని అవసరాలకు తప్ప ఆ భూములను వేరేవాటికి కేటాయించొద్దని స్పష్టం చేసింది. అంతేకాదు.. రాజధాని భూములను తనఖా పెట్టడానికి కూడా వీల్లేదని తెలిపింది. అలాగే అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించవద్దని కూడా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు చెప్పింది. అలాంటప్పుడు లేని అధికారాలతో చట్టాలను రద్దు చేయడం కుదరదని తీర్పులో పేర్కొంది. సీఆర్డీయే చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులను విచారించే బెంచ్‌లో ఉండొద్దనే పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసింది.

పిటిషనర్లకు ఖర్చుల కింద 50వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. రాజధాని అమరావతి పై 307 పేజీల తీర్పు వెలువరించింది కోర్టు. రెక్యూజల్ పిటిషన్‌పై కూడా 18 పేజీల తీర్పును హైకోర్టు వెలువరించింది. ఇద్దరు న్యాయమూర్తులను విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

Tags

Read MoreRead Less
Next Story