Andhra Pradesh: ఆ రూ.48 వేల కోట్లు ఏమయ్యాయి..?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని.. బడ్జెట్‌లో జగన్ సర్కారు గోల్‌మాల్ లెక్కలపై మరోసారి కాగ్ కడిగిపారేసింది. ఒకటికాదు.. రెండు కాదు ఏకంగా 48 వేల కోట్లకు సంబంధించిన రికార్డులు సరిగా లేవని కాగ్ చెప్పడం సంచలనం కలిగిస్తోంది. కోడ్‌కు విరుద్ధంగా ప్రభుత్వం చెల్లింపులు చేయడాన్ని తప్పుబట్టింది. అంతేకాదు.. ఏడాదిలో 103 రోజులు ఓవర్ డ్రాఫ్ట్‌లోనే ఏపీ ఉందని.. ఓడీ సౌకర్యం వినియోగించుకుంటే తప్ప రాష్ట్రానికి రోజు గడవని పరిస్థితి నెలకొందని కాగ్ ఎత్తిచూపింది.
అంతేకాదు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాజ్యాంగ విరుద్ధంగా సభ ఆమోదం లేకండానే వైసీపీ ప్రభుత్వం లక్షా 10 వేల 509.12 కోట్లు ఖర్చు చేసిందని కాగ్ ఆక్షేపించింది. మరి.. ఇంత భారీ ఖర్చులను ప్రభుత్వం బడ్జెట్‌లో ఎందుకు పెట్టలేదు..? 48 వేల కోట్లు ఏమయ్యాయి..? ఇక బడ్జెట్‌లో వేల కోట్ల కేటాయింపులు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ డొల్లతనం కూడా బయటపడింది.
బడ్జెట్ అంతా కేవలం అంకెల గారడీయే అని.. కీలకమైన రంగాలకు అసలు నిధులే ఇవ్వలేదనేది తేలిపోయింది. గతంలో చేపట్టిన కోర్టు భవనాలు, బ్రిడ్జీలు, రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని 2020-21 ఆర్థిక సంవత్సర ఆకౌంట్లకు సంబంధించి కాగ్ తన నివేదికలో బయటపెట్టింది. కొన్నింటికి రూపాయి కూడా ఇవ్వకపోగా.. మరికొన్నింటికి తూతూమంత్రంగా విదిల్చిందని పేర్కొంది.
ఏడాది క్రితం కేంద్రం.. రాష్ట్రానికి 45 వేల 454 కోట్లు ఇచ్చింది. ఇందులో 31 వేల 871.91 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరాయి. మరి మిగిలిన 13 వేల 582.19 కోట్లు ఏమయ్యాయి..? అంటే.. కేంద్రం నుంచి వచ్చే నిధులను జగన్ సర్కారు దారి మళ్లించేసిందా..? అసలు దేనికి కేటాయించిందన్న వివరాలు కూడా ప్రభుత్వం వద్ద కూడా లేదంటే దానర్థమేంటి..? ప్రతిపక్షాలను బుకాయిస్తున్నారు సరే.. రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కారు ఇచ్చే సమాధానమేంటి..?
ఏపీ ఆర్థిక పరిస్థితి, అస్తవ్యస్తంపై కాగ్ ఇచ్చిన రిపోర్టు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. కాగ్ రిపోర్ట్ అధారంగా జగన్ ప్రభుత్వంపై టీడీపీ సహా అన్ని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. 48 వేల కోట్లు ఏమయ్యాయో వైసీపీ సర్కారు వివరణ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
తాము ఏడాదిక్రితం చెప్పిన విషయం ఇప్పుడు నిజమైందన్నారు. ఏపీ బడ్జెట్ అంతా బూటకమని.. ప్రభుత్వం లెక్కలకు సర్టిఫికెట్ ఇవ్వడానికే కాగ్ భయపడిందంటే రాష్ట్ర ఆర్థిక ఆస్తవ్యస్త పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుందన్నారు. లెక్కల్లేవంటూ కాగ్ తప్పు పట్టిన అంశంపై ఆర్థికమంత్రి బుగ్గన వివరణ ఇవ్వాలన్నారు. 48 వేల కోట్లకు అకౌంట్స్ లేవంటే.. రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేయడం కాదా..? కాగ్ చెప్పిన తర్వాత కూడా సీఎం జగన్, మంత్రులు బుకాయిస్తారా..? అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
ఇప్పటికే ఏపీ ఆర్థిక పరిస్థితి రానురాను దిగజారిపోతోంది. కోలుకోలేని స్థితికి ఆంధ్రప్రదేశ్ చేరుకుందని గతంలో కాగ్ సహా జాతీయ పత్రికలు వెల్లడించాయి. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, ఇబ్బడిముబ్బడిగా అప్పులతో ఏపీ ఆర్థికంగా దివాళా దిశగా వెళ్తోందని ఆర్థిక నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అప్పులపైనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న జగన్ సర్కారు.. ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి 48 వేల కోట్లకు సంబంధించి కాగ్ ఎత్తిచూపిన గోల్‌మాల్ లెక్కలపై ప్రభుత్వం ఏంసమాధానం ఇస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com