AP: ఆంధ్రప్రదేశ్‌ తలరాతను మార్చే పోలింగ్‌ ప్రారంభం

AP: ఆంధ్రప్రదేశ్‌ తలరాతను మార్చే పోలింగ్‌ ప్రారంభం
25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌....ఓటు హక్కు వినియోగించుకోనున్న కోట్ల 14 లక్షల మంది ఓటర్లు

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతుండగా, 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 46వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిలో సుమారు 75 శాతం కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. హింసకు ఏమాత్రం తావు లేకుండా, రీపోల్ పరిస్థితులు తలెత్తరాదనే లక్ష్యంతో ఈసీ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.


సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ ప్రారంభమైంది. ఏపీలోని 25 లోక్ సభ, 175 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. గిరిజన ప్రాంతాల్లోని ఆరు నియోజకవర్గాలు మినహా అన్ని చోట్ల ఉదయం 7కు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ., అరకు పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. రీపోల్ లేని.., హింసకు తావులేకుండా పోలింగ్ నిర్వహణే లక్ష్యంగా ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్ధులు, 175 శాసనసభ నియోజకవర్గాలకు 2వేల 387మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, 4 కోట్ల 14 లక్షల 18 వందల 87 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని EVMలలో నిక్షిప్తం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం 46వేల 389 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఇందులో 12వేల 438 సమస్యాత్మ పోలింగ్ కేంద్రాల్లో ఈసీ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది.

మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 34వేల 651 చోట్ల వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలోనూ పోలింగ్ కంపార్టుమెంట్ మినహా లోపల, బయట స్పష్టంగా కనిపించేలా వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్‌ పర్యవేక్షిస్తున్నారు. పోల్ డే మోనిటరింగ్ సిస్టం అనే వెబ్ అప్లికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రతీ కదలికనూ తెలుసుకునేలా ఈసీ ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మంగా ఉన్న... మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె లాంటి 14 నియోజకవర్గాల్లో వంద శాతం వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నారు. అనంతపురం, అనకాపల్లి, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ ను ఈసీ పర్యవేక్షిస్తోంది. పోలింగ్ విధుల కోసం నిర్దేశించిన 3.30 లక్షల మంది సిబ్బంది ఇప్పటికే ఈవీఎంలతో సహా ఆయా పోలింగ్ కేంద్రాలకు ఆదివారమే చేరుకున్నారు. పోలీసు బందోబస్తు సహా ఎన్నికల విధుల కోసం మొత్తం 5.26 లక్షల మంది సిబ్బందిని ఈసీ వినియోగిస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం..... 295 కంపెనీల సాయుధ పారామిలిటరీ బలగాలతో కలిపి మొత్తం లక్షా 6 వేల మంది పోలీసు బలగాలను భద్రతా విధుల్లో మోహరించింది.

Tags

Next Story