CBN: జగన్‌ పాలనలో పోలవరం నిర్వీర్యం

CBN: జగన్‌ పాలనలో పోలవరం నిర్వీర్యం
X
మా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు... క్షేత్రస్థాయి పర్యటన అనంతరం చంద్రబాబు ఆవేదన

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి ఒక వరంగా భావించి ప్రత్యేక శ్రద్ధ పెట్టామని.. కానీ జగన్‌ తన పాలనలో దానిని నిర్వీర్యం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెపట్టిన తర్వాత తొలిసారి క్షేత్రస్థాయి పర్యటనకు పోలవరం వెళ్లిన చంద్రబాబు డ్యాంను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి అసలు రాజకీయాలకు పనికిరాడని... అర్హత లేని వ్యక్తులు పాలిస్తే ఏమవుతుందో చెప్పేందుకు పోలవరమే పెద్ద ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును చూస్తుంటే బాధ, చెప్పలేనంత ఆవేదన కలుగుతోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అయిదేళ్లు కష్టపడి చేసిన పనంతా ఇప్పుడు రివర్స్‌ అయిపోయిందని... వైసీపీ పాలనలో తాము చేసిన పనంతా మళ్లీ రివర్స్‌ అయిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసేశారని.. పోలవరం ప్రస్తుత స్థితి చూసి అందరికంటే తానే ఎక్కువ బాధపడుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు.

పోలవరం ప్రాజెక్టు ప్రతి నిర్మాణాన్ని క్షుణ్నంగా పరిశీలించిన చంద్రబాబు... అధికారులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. జగన్‌ తప్పు చేయలేదని... క్షమించరాని నేరం చేశారని... ఇప్పుడు పోలవరం పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలియదని చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని 72 శాతం పూర్తి చేశామని... జగన్‌ పాలనలో ఒక్క అడుగు ముందుకు పడలేదని చంద్రబాబు అన్నారు. తాను ఇప్పటికే 30సార్లు పోలవరాన్ని సందర్శించానని... ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 31వసారి పోలవరం వచ్చానని... వందసార్లు పోలవరంపై సమీక్షించానని చంద్రబాబు గుర్తు చేశారు. నిర్మాణం పూర్తి చేయడానికి నాలుగేళ్లు పడుతుందని ఇంజినీర్లు అంటున్నారు. కానీ పూర్తిస్థాయి నిర్మాణానికి ఎన్నాళ్లు పడుతుందో ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే తప్ప చెప్పలేమన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తప్పులు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు... రాష్ట్ర, జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఒక్కరోజైనా జగన్‌ ప్రాజెక్టును చూసి, విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడారా.. ఏం చేయాలనుకుంటున్నారో చెప్పారా అనిప్రశ్నించారు . తనను కూడా ప్రాజెక్టు వద్దకు రాకుండా అడ్డుకున్నారన్నారని... పోలవరం ప్రాజెక్టు గురించి వివరిస్తున్నంతసేపు ఆయన మాటల్లో ఆవేదన, బాధ కనిపించాయని చంద్రబాబు అన్నారు. తక్షణమే చేయాల్సిన పనులను ఆపివేయడంతో వరుసగా రెండేళ్లు వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్‌ నాలుగుచోట్ల ధ్వంసమైందని చంద్రబాబు అన్నారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలంటే రూ.990 కోట్లు ఖర్చవుతుందని... డయాఫ్రం వాల్‌ను కాపాడాల్సిన ప్రభుత్వం ప్రాజెక్టు భవిష్యత్తుతో ఆటలాడుకుందని మండిపడ్డారు.

Tags

Next Story