AP: ఏపీలో పెరగనున్న రేషన్‌ దుకాణాల సంఖ్య

AP: ఏపీలో పెరగనున్న రేషన్‌ దుకాణాల సంఖ్య
X
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం... 4 వేల కొత్త చౌకదుకాణాల ఏర్పాటుకు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్‌ దుకాణాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. రేషన్‌ పంపిణీ సజావుగా సాగేందుకు వీలుగా చౌకదుకాణాల సంఖ్యను 29,796 దుకాణాలకు అదనంగా మరో 4 వేలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన మొబైల్‌ డెలివరీ యూనిట్లలతో కార్డుదారులకు ఉపయోగం లేకపోగా.. పనులు మానుకుని ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో చౌకదుకాణాల వ్యవస్థను పటిష్ఠపరిచి, వారి ద్వారానే నిత్యావసరాలు పంపిణీ చేయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కార్డుదారులకు వీలైనంత దగ్గరలోనే దుకాణాలు ఉండేలా చూడటం, నిర్దేశిత సమయంలో సరైన తూకంతో రేషన్‌ అందించడమే లక్ష్యంగా కొత్త దుకాణాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

వైసీపీ పాలనలో ఇంటింటికీ రేషన్‌ పేరుతో 9,260 ఎండీయూలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనాల కొనుగోలు, నిర్వహణ పేరుతో రూ. 1,800 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అయినా గడప వద్దకు రేషన్‌ అందడం లేదు. రేషన్‌ బండి ఎప్పుడొస్తుందో తెలియక కూలి పని మానుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి. చాలాచోట్ల రేషన్‌ డీలర్ల ద్వారానే నిత్యావసరాలు అందించాల్సి వస్తోంది. ఎండీయూ వ్యవస్థ లేని రోజుల్లోనే రేషన్‌ పంపిణీ బాగుందని కార్డుదారుల్లోనూ అభిప్రాయం ఉంది.

కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నెలకు రెండుసార్లు చొప్పున బియ్యం, కందిపప్పు వంటివి రేషన్‌ దుకాణాల ద్వారానే పంపిణీ చేశారు. ఇలాంటి కీలకమైన వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 29,796 చౌకదుకాణాలు నడుస్తుండగా.. అందులో 6,500 పైగా ఖాళీలున్నాయి. ఒకే డీలర్‌కు రెండు, మూడు దుకాణాల ఇన్‌ఛార్జుల బాధ్యతలిచ్చారు. వీటన్నింటిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎండీయూ వ్యవస్థతో ఉపయోగం లేదని భావిస్తున్న ప్రభుత్వం.. చౌకదుకాణాలను బలోపేతం చేసేలా చర్యలు చేపట్టింది. ఖాళీగా ఉన్న చోట్ల డీలర్లను నియమించడంతోపాటు కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా చౌకదుకాణాలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఏపీలో 1.48 కోట్ల రేషన్‌ కార్డులున్నాయి. సగటున ఒక్కో దుకాణం పరిధిలో 500 రేషన్‌ కార్డులొస్తాయి. అయితే కొన్నిచోట్ల ఒక్కో దుకాణ పరిధిలో 1,000 నుంచి 1,200 వరకు కార్డులున్నాయి. ఇలా ఎక్కువ కార్డులున్న చోట అదనపు దుకాణాలు ఏర్పాటు చేస్తారు. సగటున పట్టణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి 700, గ్రామీణ ప్రాంతాల్లో 750 కార్డులు మించకుండా చూస్తారు. ఈ లెక్కన అదనంగా 4 వేల చౌకదుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేసినట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. త్వరలోనే కొత్త దుకాణాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Tags

Next Story