AP: నేడే శాసనసభా పక్ష నేత చంద్రబాబు ఎంపిక

AP: నేడే శాసనసభా పక్ష నేత చంద్రబాబు ఎంపిక
చంద్రబాబు పేరును ప్రతిపాదించనున్న పవన్‌... బలపరచునున్న బీజేపీ ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరేందుకు వీలుగా కూటమి MLAలు చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు. ఇందుకోసం విజయవాడ A-కన్వెన్షన్ సెంటర్‌లో ఇవాళ ఉదయం తొమ్మిదిన్నరకు తెలుగుదేశం-జనసేన- బీజేపీ కూటమి శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.... చంద్రబాబు పేరును సీఎంగా ప్రతిపాదించనుండగా,.. బీజేపీ ఎమ్మెల్యేలు బలపరుస్తారని తెలుస్తోంది. అనంతరం చంద్రబాబుని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపనున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ తెలుగుదేశం కూటమిని గవర్నర్ ఆహ్వానించనున్నారు.


మరోవైపు మంత్రివర్గ ఏర్పాటుపై చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఆశావహులు చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు ఉండవల్లిలోని ఇంటికి క్యూ కడుతున్నారు. చంద్రబాబుతోపాటు ఎంత మంది ప్రమాణ స్వీకారం చేస్తారు? మంత్రివర్గంలో 25 మందికి మాత్రమే అవకాశం ఉండడంతో MLCలకూ కేబినెట్ లో చోటిస్తారా? లేదా?అనే సందిగ్ధం నెలకొంది. పవన్ కళ్యాణ్ కు... ఉప ముఖ్యమంత్రి పదవి అనే ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో జనసేన-బీజేపీల నుంచి ఎంతమందికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది.

ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చివరి దశకు చేరుతున్నాయి. రేపు జరిగే వేడుకకు కేసరపల్లి ఐటీ పార్క్‌ ముస్తాబవుతోంది. ప్రమాణ స్వీకారానికి 112 వైసీపీ బాధిత కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లతో కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి కళకళలాడుతోంది. రేపు ఉదయం.. 11 గంటల 27 నిమిషాలకు ఐటీ పార్క్‌ వద్ద జరిగే ప్రమాణ స్వీకారానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రానుండడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీ షెడ్లు నిర్మించి వచ్చిన వారికి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. V.I.P.ల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నలుగురు I.A.S. అధికారులతో కూడిన కమిటి చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది కార్యకర్తల కోసం నియోజకవర్గానికి 150 పాసులు ఇచ్చే అవకాశం ఉంది. 175 నియోజకవర్గాల దాదాపు 70 వేల నుంచి లక్ష మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం నేతలు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.

Tags

Next Story