AP: తెల్ల రేషన్‌కార్డు దారులకు ఇక కందిపప్పు!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైసీపీ పాలనలో ఏడాది నుంచి కందిపప్పు పంపిణీని నిలిపివేయడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేదలకు కందిపప్పు, పంచదార సరఫరా చేయాలని భావిస్తున్న్టలు తెలుస్తోంది.
కందిపప్పును వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడంతో దానిని మళ్లీ పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదని చంద్రబాబు దృష్టికి వచ్చింది. సత్వరమే సరఫరా మొదలుపెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు కదిలారు. కందిపప్పును కొనుగోలు చేసి చౌక సరఫరాదారుల దుకాణాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఎల్లుండి( గురువారం) నుంచి బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు, పంచదారను రేషన్ షాపులకు సరఫరా చేయాల్సి ఉంది. జులై 1వ తేదీ నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదారను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కందిపప్పు, చక్కెరతో పాటు అక్కడి సరుకుల నాణ్యతను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే ఏపీ ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ ఇప్పటికే వరుస తనిఖీలతో దూసుకుపోతున్నారు. అంగన్‌వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనెతో పాటు వైట్ రేషన్ కార్డుదారులకు ఇచ్చే పంచదారలో ఎక్కడ చూసిన తక్కువ తూకంతో సరుకులు పంపిణీ జరుగుతోందని గుర్తించారు. కందిపప్పు, నూనె అయితే 50 నుంచి 100 గ్రాములు తక్కువ ఉందని నిల్వ గోదాములను తనిఖీ చేసినప్పుడు వెల్లడైంది. అనంతరం మంగళగిరిలోనూ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేయించారు. అక్కడ సైతం నిర్దేశిత పరిమాణం కంటే తక్కువ తూకంతో పంపిణీ జరుగుతున్నట్లు తేలింది. ఈ క్రమంలో ఏపీ వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించడం తెలిసిందే. ఈ అవకతవకలు జరగడానికి కారణాలపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com