AP: మళ్లీ ఇంటికే సామాజిక పింఛన్లు

AP: మళ్లీ ఇంటికే సామాజిక పింఛన్లు
కీలక ప్రకటన చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... జులైలో రూ. 7000ల పింఛన్‌

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో పింఛన్ ఇంటివద్దకే పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. జులై ఒకటో తేదీ నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉంటుందని మంత్రి సవిత వెల్లడించారు. జులైలో రూ.7000 పింఛన్ అందించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉచితంగా డీఎస్సీ ట్రైనింగ్ ఇచ్చేందుకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా గత మూడు నెలలుగా వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్లవద్దకే పింఛన్ పంపిణీ చేయగా.. మిగతా వారికి బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమచేశారు. అయితే జులై నెలలో ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తామని ఏపీ మంత్రి సవిత వెల్లడించారు. జులై ఒకటో తేదీనే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఉంటుందన్నారు ఏపీలో జులై నెలలో ఏడు వేలు పింఛన్ రూపంలో అందించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ రూ.4 వేలకు పెంచడంతో పాటుగా ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు మూడు వేలు కలిపి ఏడు వేలు చెల్లించనున్నారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సొంత నియోజకవర్గం పెనుగొండ వెళ్లిన సవితకు.. టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పెనుగొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. చేనేత రంగం అభివృద్ధికి కృషి చేస్తానని... గతంలో బీసీల కోసం టీడీపీ ప్రభుత్వం అమలు. చేసిన సంక్షేమ, రాయితీ, అభివృద్ధి పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్లలో వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగులకు ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఇక 2014లో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని కొనసాగిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఉమ్మడి జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ నిర్మాణాలను పూర్తి చేస్తామని.. చేనేత కళాకారులు, హస్తకళాకారులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు.

ఎంపీలతో చంద్రబాబు భేటీ

నేటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో లేవనెత్తాల్సిన అంశాలను, అనుసరించాల్సిన వైఖరిపై ఎంపీలతో చంద్రబాబు చర్చించి కీలక సూచనలు జారీ చేశారు. లోక్ సభ స్పీకర్ ఎంపికపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌ ఎంపికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని చంద్రబాబు తెలిపారు. అయితే లోక్‌సభ సభాపతి విషయం లో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అమిత్‌ షాకు స్పష్టంగా చెప్పానని చంద్రబాబు తెలిపారు. కూటమిలో కీలక పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి పదవులతో సంబంధంలేదని, ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చిచెప్పినట్లు షాకు వివరించినట్లు చంద్రబాబు తెలిపారు. పార్లమెంటరీ పార్టీ భేటీలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు మాట్లాడారు. పదవుల కోసం పట్టుబడితే ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయని, ఈ విషయం ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. పదవులు తమకు ముఖ్యంకాదన్నారు. ఈసారి పార్లమెంట్ లో టీడీపీకి 16 ఎంపీల బలం ఉండడంతో ఏపీకి ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని చంద్రబాబు లోక్‌సభ సభ్యులకు మార్గనిర్దేశం చేశారు.

Tags

Next Story