AP Anganwadis: ఆగని అంగన్ వార్

AP Anganwadis: ఆగని అంగన్ వార్
తారస్థాయికి అంగన్వాడీ కార్యకర్తల సమ్మె

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో అంగన్వాడీలు కదంతొక్కారు. కలెక్టరేట్ల వద్ద నిరసనలతో హోరెత్తించారు. కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జనవరి 5 అల్టిమేటంకు భయపడబోమన్న అంగన్వాడీలు... డిమాండ్లు సాధించేవరకూ తగ్గేదేలేదంటూ తేల్చిచెప్పారు. ప్రభుత్వ బెదిరింపులకు... తలొగ్గేది లేదని ముక్తకంఠంతో నినదించారు. హామీలు నెరవేర్చకపోతే బటన్‌ నొక్కి జగన్‌ను ఇంటికి పంపడం ఖాయమని హెచ్చరించారు. కలెక్టరేట్‌ల ముట్టడికి అంగన్‌వాడీలు ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఒంగోలులో భారీ సంఖ్యలో అంగన్వాడీలు కలెక్టరేట్ ముందు నిరసనకు దిగి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. తర్వాత లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.

నెల్లూరులో అంగన్వాడీలు ఉవ్వెత్తున ఉద్యమించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం మార్మోగింది. గురువారానికల్లా తమ డిమాండ్లపై జీవోలు విడుదల చేయాలని లేకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి సాగనంపుతామని హెచ్చరించారు.

అనంతపురం కలెక్టరేట్‌ వద్దకు భారీ ర్యాలీగా వచ్చిన అంగన్వాడీలు... 5వ తేదీలోపు విధుల్లో చేరాలని కలెక్టర్‌ నోటీసులు ఇవ్వటంపై మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు లొంగబోమని... ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని స్పష్టంచేశారు. పుట్టపర్తిలో గణేష్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు వేల మంది ర్యాలీ నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని అరెస్టు చేసి కదిరి స్టేషన్‌కు తరలించారు.పెద్దఎత్తున కడప కలెక్టరేట్‌ని ముట్టడించిన అంగన్వాడీలు.... మంత్రులు, అధికారుల తీరుపై మండిపడ్డారు. కడుపుకాలి రోడ్డుపైకి వస్తే పట్టించుకోరా అని నిలదీశారు.రాయచోటిలో కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకుని.. వాహనాల టైర్లలో గాలి తీసేశారు. కర్నూలు కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. తిరుపతిలో అంగన్వాడీలు ఉద్యమాన్ని హోరెత్తించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన జగన్‌... ఇప్పుడు అణచివేతకు పాల్పడటం దారుణమన్నారు. విజయవాడలో కలెక్టరేట్‌ ముట్టడికి అంగన్వాడీలు చేసిన ప్రయత్నం అరెస్ట్‌కు దారితీసింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న అంగన్వాడీలను... మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది.మచిలీపట్నంలో భారీ ర్యాలీగా కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. బారికేడ్లను తోసేసి కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి... అంగన్వాడీలు నిరసనకు దిగారు. నందిగామలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ MLA తంగిరాల సౌమ్య ఠాణాకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు.గుంటూరు కలెక్టరేట్‌ వద్ద నిరసనలతో హోరెత్తించిన అంగన్వాడీలు... శాంతియుత ఆందోళనలపై ఆంక్షలెందుకని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్‌ గేటు వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి అంగన్వాడీలు నిరసన చేపట్టారు. ఏలూరులో జ్యూట్ మిల్లు నుంచి జెడ్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు. రోడ్డుపై బైఠాయించి పాటలు పాడుతూ, భజనలు చేస్తూ నిరసన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story