AP: నేడే అన్న క్యాంటీన్ల ప్రారంభం
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి అన్న క్యాంటీన్లు తెరుచుకోనున్నాయి. వంద అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్ట్ 16న మిగతా 99 అన్న క్యాంటీన్లను మంత్రులు ప్రారంభించనున్నారు. అన్న క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి రోజూ 1.05 లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35 వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35 వేలు, రాత్రి మరో 35 వేల మందికి ఆహారం అందించనున్నారు.ఒక్కొక్కరి నుంచి పూటకు రూ.5 చొప్పున నామమాత్రపు ధర వసూలు చేయనున్నారు.
తొలి విడతలో 100 క్యాంటీన్లు
రేపు (శుక్రవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మూసివేసి నిరుపేదలను రోడ్డున పడేసింది. అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీయే ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోనుంది. 203 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించినా భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
భారీగా విరాళం
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ అయిన నారా భువనేశ్వరి భారీ విరాళం అందించారు. ఎన్టీఆర్ ట్రస్టు తరుఫున నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ. కోటి విరాళంగా అందించారు. కోటి రూపాయల విరాళం తాలూకు చెక్కును నారా భువనేశ్వరి ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అందజేశారు. నిరుపేదలు, కూలీలు, కార్మికుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్‌లు ఎంతో గొప్ప కార్యక్రమమని నారా భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. విరాళం అందించిన విషయమై ట్వీట్ చేసిన భువనేశ్వరి.. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్‌లో ఆకలి అనే పదం వినపడకూడదనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను మళ్లీ పునఃప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com